నష్టాల్లో కూరుకుపోయిన ఓ సంస్థకు రుణం అందించటంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అల్లుడు జేరడ్ కుష్నర్ పాత్ర ఉండే అవకాశం ఉందని పేర్కొంది మహమ్మారి సహాయ నిధి పర్యవేక్షణ కమిటీ. సదరు సంస్థకు సుమారు 700 మిలియన్ డాలర్ల విపత్తు సహాయ రుణం అందినట్లు తెలిపింది. ఆ సంస్థ నష్టాలతో సతమతమవుతున్న కారణంగా ప్రజల సొమ్ము నష్టపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.
గురువారం జరిగిన విచారణంలో భాగంగా..'వైఆర్సీ వరల్డ్‌వైడ్' అనే సంస్థకు రుణం మంజూరు చేస్తూ ట్రెజరీ విభాగం తీసుకున్న నిర్ణయాన్ని ప్యానల్ ప్రశ్నించింది. నలుగురు సభ్యుల కాంగ్రెస్ నిఘా కమిషన్‌లో ఒకరైన భరత్ రామమూర్తి ఈ మేరకు కుష్నర్ పాత్రను ప్రస్తావించారు.
జాతీయ భద్రతకు వైఆర్సీ వ్యాపారం కీలకమంటూ రుణం ఇవ్వటాన్ని ప్యానల్ సభ్యులు ప్రశ్నించారు. ట్రెజరీ విభాగం కార్పొరేట్ సహాయ కార్యక్రమంలో భాగంగా జాతీయ భద్రతను పరిగణనలోకి తీసుకుని ఇంత భారీ మొత్తంలో రుణాలు ఇవ్వటం ఇదే తొలిసారి కావటం అనుమానాలకు తావిస్తోంది.
2017లోనే..
గతేడాది అపోలో గ్లోబల్ మేనేజ్మెంట్ నుంచి 600 మిలియన్ డాలర్ల రుణం అందుకుంది వైఆర్సీ. అపోలో నేతృత్వంలో పలు సంస్థలతో ఏర్పాటైన ప్రైవేటు ఈక్విటీ సంస్థ.. వైఆర్సీకి అతిపెద్ద రుణదాతగా ఉన్నట్లు నిఘా ప్యానెల్ వెల్లడించింది. అపోలో సహ వ్యవస్థాపకుడు జాషువా హారిస్ 2017 తొలినాళ్లలో మౌలిక సదుపాయాల విధానంపై ట్రంప్ పరిపాలన విభాగానికి సలహా ఇచ్చారు. అధ్యక్షుడి సలహాదారుగా ఉన్న కుష్నర్ను కలిశారు. ఆ తర్వాత కొద్ది రోజులకే కుష్నర్ కుటుంబానికి చెందిన స్థిరాస్తి సంస్థకు సుమారు 184 మిలియన్ డాలర్లు అందించినట్లు రామమూర్తి తెలిపారని న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది.
విచారణ సందర్భంగా వైఆర్సీ రుణాలకు సంబంధించి కుష్నర్, ఆయన సిబ్బందితో ఏమైనా సంబంధాలు ఉన్నాయా అని ట్రెజరీ కార్యదర్శి స్టివెన్ మునుచిన్ను ప్రశ్నించారు రామమూర్తి. దానికి తనకు ఎలాంటి సంబంధాలు లేవని సమాధానమిచ్చారు మునుచిన్. శ్వేతసౌధానికి చెందిన ఎవరైనా ఈ రుణాల గురించి అభ్యర్థించారా అని మరో ప్రశ్న అడిగారు. ఈ అంశంపై మరింత లోతైన దర్యాప్తు అవసరమని అభిప్రాయపడ్డారు రామమూర్తి. వైఆర్సీ రూణాన్ని వేగంగా అమలు చేసిన, ఉదారంగా ఇచ్చిన లోన్‌గా పేర్కొన్నారు. అయితే.. వైఆర్సీకి రుణాలు ఇచ్చిన నిర్ణయాన్ని సమర్థించుకున్నారు మునుచిన్. జాతీయ భద్రతకు కీలకంగా మారే సంస్థల్లో వైఆర్సీ అన్ని ప్రమాణాలను నిరూపించుకున్నట్లు తెలిపారు
అయితే.. ఈ అంశంపై కుష్నర్ లేదా ఆయన సిబ్బంది ఎవరూ స్పందించలేదు.
మాకు సంబంధం లేదు..
ట్రెజరీ ఫండ్స్ నుంచి రుణాలు పొందాలనే వైఆర్సీ నిర్ణయంలో అపోలోకు సంబంధం లేదని పేర్కొన్నారు ఆ సంస్థ ప్రతినిధి జాన్ రోస్. వేల సంస్థలకు తాము రుణాలు అందించామని, వైఆర్సీకి అందించిన వాటిలో తాము ఒకరమని పేర్కొన్నారు.
ఇదీ చూడండి:కమల, ఫౌచీ పేర్లనే తప్పుగా పలికారు!