భారత్, చైనా దేశాల మధ్య నెలకొన్న ప్రతిష్టంభనపై కీలక వ్యాఖ్యలు చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఇరు దేశాల ప్రజల శాంతి కోసం శాయశక్తులా కృషి చేస్తానని ప్రకటించారు. రెండు దేశాల మధ్య సరిహద్దు ప్రతిష్టంభనపై ముందు నుంచి భారత్కు మద్దతుగా నిలుస్తోంది ట్రంప్ పరిపాలన విభాగం.
సరిహద్దులో నెలకొన్న సమస్య అంశంలో భారత్కు ట్రంప్ మద్దతుగా నిలుస్తారా అన్న ప్రశ్నకు ఈ మేరకు స్పందించారు శ్వేతసౌధం అధికార ప్రతినిధి కైలీ మెక్ఎనానీ.
"భారత్, చైనా ప్రజలను అమితంగా ప్రేమిస్తానని ఆయన (ట్రంప్) తెలిపారు. ఇరు దేశాల ప్రజల శాంతి కోసం శాయశక్తులా కృషి చేస్తానన్నారు."
- కైలీ మెక్ఎనానీ, శ్వేతసౌధం అధికార ప్రతినిధి
అంతకుముందు.. అమెరికాకు భారత్ కీలక భాగస్వామి అని పేర్కొన్నారు శ్వేతసౌధం ఆర్థిక సలహాదారు లారీ కుడ్లో. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి.. ట్రంప్ గొప్ప స్నేహితుడని తెలిపారు.
అలాగే.. అమెరికాకు భారత్ గొప్ప భాగస్వామిగా అభివర్ణించారు అగ్రరాజ్య విదేశాంగ శాఖ మంత్రి మైక్ పాంపియో. భారత విదేశాంగ మంత్రితో తనకు మంచి సంబంధాలు ఉన్నాయన్నారు. చైనాతో సరిహద్దు ప్రతిష్టంభన సహా కీలక అంశాలపై తాము పలుమార్లు చర్చించినట్లు వెల్లడించారు.
ఇదీ చూడండి: ఆశలు పెంచిన ఆక్స్‌ఫర్డ్- వైరస్ నుంచి డబుల్ రక్షణ!