కరోనా సంక్షోభంతో ప్రపంచ దేశాలు గడగడలాడుతున్నాయి. వైరస్ మరణాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా ప్రపంచవ్యాప్తంగా మరణాల సంఖ్య 6లక్షలు దాటింది. మొత్తం మీద 6,05,813 మంది వైరస్‌కు బలయ్యారు. కేసుల సంఖ్య కూడా పెరుగుతోంది. ఇప్పటివరకు 1,44,65,556 మందికి వైరస్ సోకింది. అమెరికా, దక్షిణాఫ్రికా తదితర దేశాల్లో కరోనా నియంత్రణలోకి రాకపోవడం ఇందుకు కారణమని నిపుణులు చెబుతున్నారు.
కరోనా కేసుల్లో ప్రపంచవ్యాప్తంగా 5వ స్థానానికి చేరింది దక్షిణాఫ్రికా. మొత్తం మీద 3,50,879 కేసులు నమోదయ్యాయి. ఆఫ్రికా ఖండంలో దాదాపు సగం కేసులు ఇక్కడే బయటపడటం గమనార్హం.
దేశం | కేేసులు | మరణాలు |
అమెరికా | 38,35,430 | 1,42,883 |
బ్రెజిల్ | 20,75,247 | 78,817 |
రష్యా | 7,71,546 | 12,342 |
దక్షిణాఫ్రికా | 3,50,879 | 4,948 |
పెరూ | 3,49,500 | 12,998 |
మెక్సికో | 3,38,913 | 38,888 |
చిలీ | 3,28,846 | 8,445 |
స్పెయిన్ | 3,07,335 | 28,420 |
బ్రియన్ | 2,94,006 | 45,273 |
ప్రపంచం పరిస్థితి ఇలా...
- అమెరికాలోని ఫ్లోరిడా, టెక్సాస్, ఆరిజోనా సహా ఇతర రాష్ట్రాల్లో వైరస్ కేసులు పెరుగుతున్నాయి. లాక్డౌన్ ఎత్తివేతపై అనేకమంది నిపుణులు విమర్శలు చేస్తున్నారు. పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నా.. ఇంకా చాలామంది మాస్కులు ధరించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
- హాంగ్‌కాంగ్‌లో వైరస్ ఉద్ధృతి మళ్లీ పెరిగింది. ఆసియా వాణిజ్య రాజధానిలో పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్నాయని హాంగ్‌కాంగ్ నేత క్యారీ లామ్ ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఆంక్షలను మరోమారు కఠినతరం చేశారు అధికారులు. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించడాన్ని తప్పనిసరి చేశారు.
- ఐరోపాలో మునుపటితో పోల్చుకుంటే వైరస్ తీవ్రత తక్కువగానే ఉంది. కానీ స్థానికంగా వైరస్ వ్యాప్తి పెరుగుతోంది. ఇది అధికారులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.
- ఆస్ట్రేలియాలోని విక్టోరియాలో కేసుల సంఖ్య మళ్లీ పెరిగింది. దీంతో రాష్ట్రంలోని మెల్బోర్న్ సహా ఇతర ప్రాంతాల్లో మాస్కులు ధరించడాన్ని తప్పనిసరి చేశారు.
ఇదీ చూడండి:- కరోనా టీకాపై అగ్రదేశాల యుద్ధం!