అమెరికా ఫ్లోరిడా రాష్ట్రానికి చెందిన వెస్ట్ పామ్ బీచ్ ప్రపంచంలోని పర్యాటక ప్రాంతాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. ఇక్కడి రిసార్టులు, రెస్టారెంట్లలో రోజూ ఎంతోమంది పర్యటకులు విడిది చేస్తుంటారు.
ప్రస్తుతం నగరంలోని భవనాల బయట స్పీకర్స్‌తో పాటలు పెడుతున్నారు. పర్యటకులను ఆకట్టుకోడానికో లేదా మనసుకు ఆహ్లాదాన్ని కలిగించేందుకో కాదు. నగరంలోని చాలామంది నిరాశ్రయులున్నారు. వారంతా రాత్రి సమయాల్లో రోడ్లపై పడుకుంటారు. అలాంటి వారి నిద్రకు భంగం కలిగించి.. అక్కడి నుంచి వెళ్లగొట్టేందుకే విసుగుతెప్పించే ఈ సంగీతాన్ని పెడుతున్నారు బీచ్ అధికారులు.
"ఇలా రోడ్లపై పడుకోవడం ఆమోదయోగ్యం కాదని మీకూ తెలుసు. అంతేకాక భవనాల్లో అద్దెకుంటున్నవారు వీరి వల్ల అసౌకర్యానికి గురవుతున్నారు. ఇందుకు సరైన పరిష్కారం ఇదేనని అనిపించింది. విసుగుపుట్టించే సంగీతాన్ని పెడితే రోడ్లపై పడుకోవాలకునే వారు దూరంగా వెళ్లిపోతారు."
-కేయిత్ జేమ్స్, వెస్ట్ పామ్ బీచ్ మేయర్
బీచ్ అధికారుల తీరుపై నిరాశ్రయులు మండి పడుతున్నారు. ఇళ్లు లేని తమపై ఇలా సంగీతంతో భయపెడ్డటం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
"వారు దీనిని సంగీతం అంటున్నారు. నిజానికి కాదు. 30 సెకన్లు ఉండే ఆ సంగీతం గంటలో 120 సార్లు ప్లే అవుతుంది. ఇక రోజులో వేలసార్లే. విసుగుతెప్పించి ఇక్కడనుంచి వెళ్లగొట్టేందుకే ఇలా చేస్తున్నారు."
-డాన్ కెచ్చమ్, నిరాశ్రయుడు