కరోనా వైరస్ రూపంలో అమెరికాపై దాడి జరిగిందని ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా వైరస్ ఒక ఫ్లూ మాత్రమే కాదని ట్రంప్ అభిప్రాయపడ్డారు. 1917 తర్వాత ఇలాంటిది ప్రపంచం ఎన్నడూ చూడలేదన్నారు. ప్రపంచ మహమ్మారితో అస్తవ్యస్తమైన పరిస్థితుల్ని చక్కదిద్దేందుకు ప్రభుత్వం తీవ్రంగా శ్రమిస్తున్న తరుణంలో అధ్యక్షుడు ఈ వ్యాఖ్యలు చేశారు.
"ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అమెరికా సొంతం. మూడేళ్లు శ్రమించి దాన్ని నిర్మించాం. ఆకస్మికంగా ఒక రోజు వచ్చి అన్నిటినీ మూసేయాలన్నారు. ఇప్పుడు వాటిని తిరిగి తెరుస్తాం. మునుపెన్నడూ లేనంత దృఢంగా ఉంటాం. అయితే దానికి కొంత డబ్బు ఖర్చుపెట్టాల్సి ఉంటుంది."
--- డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు.
అమెరికాను వైరస్ వణికిస్తోంది. ప్రపంచ దేశాల్లో ఎక్కడా లేనన్ని కేసులు, మరణాలు ఒక్క అగ్రరాజ్యంలోనే నమోదవుతున్నాయి. ఇప్పటివరకు 47వేల మంది ప్రాణాలు కోల్పోగా.. 8,49,000మందికి వైరస్ సోకింది.
'ఆయన ఎవరో నాకు తెలియదు...'
రిక్ బ్రైట్ అనే ఫెడరల్ ఉద్యోగి ట్రంప్ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. వైరస్‌కు హైడ్రాక్సీక్లోరోక్విన్ విరుగుడని ప్రచారం చేసేందుకు రాజకీయాలు చేస్తున్నారని.. వాటిని అడ్డుకున్నందుకే తనను ఉద్యోగం నుంచి తీసివేశారని తెలిపారు. ఈ అంశంపై ట్రంప్ స్పందించారు. అసలు రిక్ అనే వ్యక్తి ఎవరో తనకు తెలియదని స్పష్టం చేశారు.
మరోవైపు శీతాకాలంలో వైరస్ మళ్లీ విజృంభిస్తుందన్న నివేదికలను ప్రముఖ డాక్టర్, అమెరికా అరోగ్య కార్యదర్శి ఆంటోని ఫౌచి సమర్థించారు. అలా జరిగే అవకాశాలు అధికంగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. అయితే దేశంలో వైరస్ తిరిగి రాదన్న ట్రంప్ వ్యాఖ్యలకు.. ఫౌచి మాటలు విరుద్ధంగా ఉన్నాయి.
ఇదీ చూడండి:- కరోనా చికిత్సకు ఆ మందు వాడితే ప్రాణాలు హరీ!