చైనా టెలికాం కంపెనీ హువావేపై అమెరికా కఠిన వైఖరి అవలంబిస్తోంది. దీన్ని చైనా కమ్యూనిస్టు పార్టీ నిఘా విభాగానికి చెందిన సంస్థగానే పరిగణిస్తోంది. అమెరికా చట్టాల నుంచి తప్పించుకునే ఎత్తులు వేయకుండా నిరోధించడం కోసం 21 దేశాల్లో ఆ కంపెనీకి ఉన్న 38 సంస్థలను కూడా పరిధి జాబితా(ఎంటిటీ లిస్ట్)లో చేర్చింది.
ఈ జాబితాలో భారత్‌లోని హువావే అనుబంధ సంస్థలు కూడా ఉన్నాయి. దీని ప్రకారం అమెరికా సంస్థలు రూపొందించిన చిప్స్‌ను హువావే కొనుగోలు చేయడానికి వీల్లేదు. వేరే దేశం ద్వారా కూడా కొనుగోలు చేయడానికి అవకాశం లేదు.
తమ నిర్ణయం ద్వారా ప్రభావితమయ్యే సంస్థలు, వినియోగదారులకు ఇప్పటికే వీలైనంత సమయాన్ని ఇచ్చామని, వారు వేరే సాంకేతికత, సాఫ్ట్వేర్, పరికరాలను ప్రత్యామ్నాయాలుగా ఎంచుకునేందుకు అవకాశం కల్పించినట్లు అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో తెలిపారు.
చైనా సంస్థలే లక్ష్యంగా ఆంక్షలు విధిస్తున్న అమెరికా ఇప్పటికే టిక్‌టాక్‌ను నిషేధించింది. సంస్థ ఆస్తులను 90 రోజుల్లోగా విక్రయించాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు. ఈ-కామర్స్ దిగ్గజం అలీబాబాతో పాటు మరిన్ని చైనా సంస్థలను నిషేధించే అవకాశముందని సూచనప్రాయంగా వెల్లడించారు.