అమెరికాలోని అలబామాలో భారతీయ యోగాపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసే బిల్లు ఆ రాష్ట్ర ప్రతినిధులో అత్యధిక మెజారిటీతో నెగ్గింది. డెమొక్రటిక్ పార్టీ నేత జెరెమీ గ్రే ప్రవేశపెట్టిన యోగా బిల్లుకు 84-17 ఓట్లతో ఆమోదం లభించింది. యోగా బిల్లు ప్రస్తుతం ఆ రాష్ట్ర సెనేట్‌కు పంపారు. అక్కడ ఆమోదం పొంది గవర్నర్ కే ఈవే సంతకం చేస్తే అలబామాలో యోగాపై నిషేధం తొలగిపోనుంది.
ప్రతిపాదిత చట్టం అమల్లోకి వస్తే అలబామా విద్యాసంస్థల్లో ఎల్కేజీ నుంచి ఇంటర్ వరకు యోగాను పునఃప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తోంది.
నమస్తేపై నిషేధం కొనసాగింపు
ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సహా వివిధ దేశాధినేతలు పలకరింపునకు భారతీయ సంప్రదాయమైన నమస్కారాన్ని అనుసరిస్తున్నారు. ఈ నేపథ్యంలో నమస్తేపై ఉన్న నిషేధాన్ని తొలగించే దిశగా తాజా బిల్లులో ప్రతిపాదనేది చెయ్యలేదు. ఈ కారణంగా అలబామాలో నమస్తేతో పలకరింపుపై ఆంక్షలు కొనసాగనున్నాయి.
ఇదీ నేపథ్యం
యోగా, హిప్నాటిజం, ధ్యానం వంటి అంశాలపై నిషేధం విధిస్తూ 1993లో అలబామా బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో యోగాపై నిషేధం ప్రస్తుతం కొనసాగుతోంది.