వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు అమెరికా పరిశోధకులు కొత్తరకం దగ్గు బిళ్లలను అభివృద్ధి చేస్తున్నారు. నోటిలో వేసుకుంటే.. లాలాజలం బరువు పెరిగేలా, సులువుగా అతుక్కునేలా వీటిని రూపొందిస్తున్నారు. ఆరడుగుల భౌతిక దూరం పాటించడం, మాస్కులు పెట్టుకోవడం.. ఈ రెండూ కొవిడ్ వ్యాప్తిని గణనీయంగా అడ్డుకుంటాయి. అయితే క్రమేపీ నిబంధనలు సడలిస్తున్న నేపథ్యంలో పరిశ్రమలు, కార్యాలయాలు, దుకాణాలు, ప్రజా రవాణా వ్యవస్థలు, ఆస్పత్రులు వంటిచోట్ల ఆరు అడుగుల దూరం పాటించడం అంతగా సాధ్యం కాకపోవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు.
దీంతో భౌతిక దూరాన్ని 6 నుంచి 2 అడుగులకు తగ్గించేందుకు అనువుగా సెంట్రల్ ఫ్లోరిడా విశ్వవిద్యాలయ పరిశోధకుల (యూసీఎఫ్) బృందం కొత్తరకం దగ్గుబిళ్లల అభివృద్ధిపై దృష్టి సారించింది. ఎక్కడికైనా వెళ్లేముందు ఈ బిళ్లలు వేసుకుంటే తుమ్మినా, దగ్గినా తుంపర్లు గాల్లో ఎగరకుండా వెంటనే నేలపై పడిపోతాయని పరిశోధకులు చెబుతున్నారు. ప్రాథమికంగా తేలిన అంశాల ప్రకారం మాస్క్ పెట్టుకుని, ఈ బిళ్లలను వినియోగిస్తే భౌతిక దూరం 2 అడుగులకు సరిపోతుందని తెలిపారు. ఈ విధంగా హై-స్పీడ్ కెమెరాల ద్వారా తుంపర్లు గాల్లోకి ప్రయాణించే తీరును పరిశీలించారు. తుమ్మినప్పుడు కూడా తుంపర్లు ఎక్కువ దూరం వెళ్లకపోవడాన్ని గమనించారు.