అమెరికా అధ్యక్ష ఎన్నికలను డొనాల్డ్ ట్రంప్‌కు అనుకూలంగా ప్రభావితం చేసేలా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆదేశాలు జారీ చేసినట్లు నిఘా వర్గాల విశ్లేషణలో తేలింది. బైడెన్‌కు వ్యతిరేకంగా, అమెరికాలో సామాజిక విభజనను పెంచేలా చేపట్టిన చర్యలకు ఆయన అనుమతులు ఉన్నాయని ఓ నివేదికలో వెల్లడైంది.
2020 అధ్యక్ష ఎన్నికల్లో విదేశీ శక్తుల ప్రమేయంపై డైరెక్టరేట్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ రూపొందించిన సవివర నివేదిక మంగళవారం విడుదలైంది. బైడెన్‌పై బురదజల్లేలా ట్రంప్ సన్నిహితులను ఉపయోగించుకొని రష్యా చేసిన కార్యక్రమాల గురించి ఇందులో ప్రస్తావించారు. అయితే ఓట్లను మార్చడం కానీ, ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగించడం కానీ జరిగిందనేందుకు ఆధారాలేవీ లేవని నివేదిక స్పష్టం చేసింది.
ట్రంప్‌కు వ్యతిరేకంగా ఇరాన్
రష్యాతో పాటు ఇరాన్ సైతం ఎన్నికలపై ప్రభావం చూపించేందుకు విస్తృత ప్రయత్నాలు చేసిందని ఈ నివేదిక తెలిపింది. ట్రంప్ రీఎలక్షన్ ప్రక్రియను దెబ్బతీయడం సహా ఓటింగ్ విశ్వసనీయతను తగ్గించడానికి ఇరాన్ చేసిన ప్రయత్నాల గురించి నివేదిక వివరించింది. ఇరాన్ సుప్రీం లీడర్ అయాతొల్లా అలీ ఖమైనీ ఆదేశాలతోనే ఇవి జరిగాయని పేర్కొంది. 2016తో పోలిస్తే ఈసారి ఎన్నికల్లో ఇరాన్ జోక్యం మరింత పెరిగిందని తెలిపింది. ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా ఇరాన్ ఇటువంటి ప్రయత్నాలు కొనసాగించిందని వెల్లడించింది.
చైనా దూరం
అమెరికా ఎన్నికల్లో చైనా జోక్యం చేసుకోలేదని నివేదిక స్పష్టం చేసింది. ఎన్నికల ఫలితాలను ప్రభావితం చైనా తొలుత భావించినా.. చివరకు ఎలాంటి ప్రయత్నాలు చేయలేదని వివరించింది. అమెరికాతో స్థిరమైన సంబంధాలను చైనా కోరుకుందని నివేదిక పేర్కొంది. ఎన్నికల్లో జోక్యం చేసుకున్నట్లు తేలడం కన్నా... అధ్యక్ష ఫలితం ఏదైనప్పటికీ అంగీకరించడమే మేలని చైనా భావించినట్లు అభిప్రాయపడింది.
ఇదీ చదవండి: