రష్యా నుంచి ఎస్-400 ట్రయంఫ్ దూరశ్రేణి క్షిపణులను కొనుగోలు చేయకుండా భారత్‌పై ఆంక్షలు(CAATSA sanctions) విధించొద్దని అమెరికాలో ఇద్దరు కీలక చట్టసభ సభ్యులు ఆ దేశ అధ్యక్షుడు బైడెన్‌కు లేఖ రాశారు. ఈ మేరకు క్షిపణుల కొనుగోలుకు అడ్డంకిగా మారే అవకాశం ఉన్న 'కౌంటరింగ్ అమెరికాస్ అడ్వర్సరీస్ థ్రూ సాంక్షన్స్ యాక్ట్ (కాట్సా)' ఆంక్షల్ని భారత్‌పై(CAATSA sanctions on India) అమలు చేయొద్దని కోరారు. ఇది భారత్‌తో పాటు అమెరికా జాతీయ భద్రతకు కూడా సంబంధించిన అంశమని డెమోక్రాటిక్ పార్టీకి చెందిన మార్క్ వార్నర్, రిపబ్లికన్ పార్టీకి చెందిన జాన్ కోర్నిన్.. అధ్యక్షుడు బైడెన్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు. కాట్సా చట్టంలోని నిబంధనల ప్రకారం ఆంక్షల నుంచి మినహాయింపునిచ్చే అధికారం అధ్యక్షుడికి ఉందన్నారు.
కారణమిదే..
రష్యా నుంచి సుదీర్ఘకాలంగా ఆయుధ కొనుగోళ్లు చేస్తున్న భారత్ ఈ మధ్యకాలంలో భారీగా తగ్గించుకొందని వార్నర్, కోర్నిన్ తెలిపారు. 2016-2020 మధ్య కొనుగోళ్లు 53 శాతం తగ్గాయని వెల్లడించారు. మరోవైపు అమెరికా నుంచి 3.4 బిలియన్ డాలర్ల ఆయుధ కొనుగోళ్లకు 2020లో భారత్ ఒప్పందం కుదుర్చుకొందని గుర్తు చేశారు. పైగా వ్యాక్సిన్, రక్షణ, ఇంధనం, సాంకేతికత వంటి రంగాల్లో భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతమవుతున్నాయని లేఖలో వార్నర్, కోర్నిన్ పేర్కొన్నారు. ఈ తరుణంలో ఆంక్షలు విధించడం వల్ల సంబంధాలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందన్నారు. అలాగే అమెరికా నమ్మదగిన మిత్రదేశం కాదన్న వాదన భారత్‌లో బలపడే ప్రమాదం ఉందన్నారు.
ఈ పరిణామాల నేపథ్యంలో భారత్‌పై ఆంక్షలు(CAATSA sanctions on India) విధించడం కంటే సఖ్యతే మేలు చేస్తుందని ఇద్దరు చట్టసభ సభ్యులు అభిప్రాయపడ్డారు. అలాగే భారత్ ప్రాంతీయంగా ఎదుర్కొంటున్న జాతీయ భద్రత ముప్పు దృష్ట్యా ప్రత్యామ్నాయ ఆయుధ కొనుగోళ్లకు మార్గం చూపించాల్సిన అవసరం ఉందన్నారు. అమెరికా అభివృద్ధి చేస్తున్న ఆయుధ, రక్షణ వ్యవస్థలు భారత అవసరాలకు సరిపోతాయన్న నమ్మకం కలిగించాలన్నారు. ఈ మేరకు భారత ప్రభుత్వ యంత్రాంగంతో చర్చలు జరపాలన్నారు. దీనివల్ల ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనా దూకుడుకు కూడా అడ్డుకట్ట వేసే అవకాశం ఉందన్నారు.
భారత్ 540 కోట్ల డాలర్లతో ఎస్-400 క్షిపణులను కొనేందుకు రష్యాతో 2018లో ఒప్పందం కుదుర్చుకొంది. అదే సంవత్సరం అమెరికా అమలులోకి తెచ్చిన కాట్సా చట్టం ఎస్-400 క్షిపణి కొనుగోలుకు అడ్డు తగులుతుందా- అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. కాట్సా అనేది అమెరికా ప్రత్యర్థులపై ఆర్థిక ఆంక్షలను ప్రయోగించడానికి అధికారమిచ్చే చట్టం. అమెరికా దీని కింద రష్యా, ఇరాన్, ఉత్తర కొరియా రక్షణ ఉత్పత్తుల సంస్థలతో వ్యాపారం చేసే దేశాలపై ఆంక్షలు విధించవచ్చు.
ఇదీ చూడండి: 2021 చివరి నాటికి భారత్‌కు ఎస్-400 క్షిపణి: రష్యా