అమెరికా సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ అమెరికన్ల హవా కనిపిస్తోంది. అక్కడి చట్టసభకు ఈసారి ఎక్కువ మంది భారతీయ అమెరికన్లు ఎన్నికయ్యే అవకాశం ఉన్నట్లు తాజా పోల్స్ ద్వారా స్పష్టమవుతోంది.
ఇప్పటికే పలువురు భారత సంతతి అమెరికన్లు కాంగ్రెస్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రస్తుతం డెమొక్రటిక్ పార్టీ తరఫున ఉపాధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న కమలా హారిస్.. సెనేటర్‌గా ఉన్నారు. ఏకంగా దేశ రెండో అత్యున్నత పదవికి పోటీ చేస్తూ.. ఇప్పటికే అందరి దృష్టిని ఆకర్షించారు కమల.
పెరగనున్న 'సమోసా కాకస్' సైజు!
అమెరికా పార్లమెంట్‌కు ఎన్నికైన భారత సంతతి సభ్యులను 'సమోసా కాకస్'గా పిలుస్తుంటారు. చట్టసభ్యుడు రాజా కృష్ణమూర్తి ఈ పదబంధాన్ని తొలిసారి ప్రయోగించారు. ప్రస్తుతం ఈ సమోసా కాకస్‌లో ఐదుగురు సభ్యులు ఉన్నారు. ఒకరు సెనేటర్(కమలా హారిస్) కాగా.. అమి బెరా, రోహిత్ ఖన్నా, రాజా కృష్ణమూర్తి, ప్రమీలా జయపాల్ ప్రతినిధుల సభలో సభ్యులుగా ఉన్నారు. వీరంతా వచ్చే ఎన్నికల్లోనూ విజయదుందుబి మోగించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
సీనియర్ నేత డా. బెరా ప్రతినిధుల సభకు ఐదోసారి ఎన్నికయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. అమెరికా చట్ట సభలో సుదీర్ఘ కాలం పనిచేసిన భారతీయ అమెరికన్‌గా బెరా రికార్డుకెక్కారు. కాలిఫోర్నియా నుంచి ఆయన పోటీ చేస్తున్నారు. మాజీ సైనికాధికారి, రిపబ్లికన్ నేత బజ్ పాటర్సన్ ఆయనకు పోటీగా ఉన్నారు.
వరుసగా మూడోసారి ఎన్నికవ్వాలని రోహిత్ ఖన్నా, జయపాల్ ఊవిళ్లూరుతున్నారు. వీరిద్దరూ తమ ప్రత్యర్థులపై ఆధిపత్యం కనబరుస్తున్నారు.
కృష్ణమూర్తి ఎన్నిక లాంఛనమేనని విశ్లేషకులు భావిస్తున్నారు. డెమొక్రటిక్ పార్టీ కంచుకోట అయిన ఇల్లినాయీలోని ఏడో కాంగ్రెషనల్ జిల్లా నుంచి పోటీ చేస్తున్నారు కృష్ణమూర్తి. ఇక్కడ డెమొక్రాట్ల ప్రాబల్యం ఎంతంటే.. ప్రధాన రిపబ్లికన్ పార్టీ తమ అభ్యర్థిని సైతం నిలబెట్టలేదు. ప్రైమరీ ఎన్నికల నుంచే ఈ స్థానం నుంచి తప్పుకుంది. అయితే లిబర్టేరియన్ పార్టీ నేత ప్రీస్టన్ నెల్సన్ కృష్ణమూర్తితో పోటీ పడుతున్నారు. అయినా కృష్ణమూర్తి విజయం నల్లేరుపై నడకేనని తెలుస్తోంది.
వీరితో పాటు...
ప్రతినిధుల సభకు ఎన్నికైన తొలి భారత సంతతి అమెరికన్‌గా ప్రమీలా జయపాల్ ఇదివరకే రికార్డు నెలకొల్పారు. ఈసారి ప్రమీలాకు తోడుగా డా. హీరాల్ తిపిర్నేని.. దిగువ సభకు ఎన్నికవనున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అరిజోనాలోని ఆరో కాంగ్రెస్ జిల్లా నుంచి తిపిర్నేని పోటీ చేస్తున్నారు. ప్రత్యర్థి, రిపబ్లికన్ నేత డేవిడ్ ష్వీకెర్ట్పై స్వల్ప ఆధిక్యం కనబరుస్తున్నారు.
డెమొక్రటిక్ నేత, మాజీ దౌత్యవేత్త శ్రీ ప్రీస్టన్ కుల్కర్ణి సైతం ఎన్నికల్లో దూసుకెళ్తున్నారు. ప్రత్యర్థిపై 5 శాతం ఓట్ల తేడాతో ముందున్నారు. టెక్సాస్‌లోని 22వ కాంగ్రెషనల్ జిల్లా స్థానం నుంచి బరిలో ఉన్నారు. 2018లో జరిగిన ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో ఓటమిపాలైన ఆయనకు.. ఈసారి విజయం వరించే అవకాశం ఉందని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. కుల్కర్ణి గెలిస్తే టెక్సాస్ నుంచి అమెరికా కాంగ్రెస్‌కు ఎన్నికైన తొలి భారతీయ అమెరికన్‌గా చరిత్ర సృష్టిస్తారు.
ఎగువ సభకు కూడా
పలువురు భారతీయ అమెరికన్లు సెనేట్ బరిలోనూ ఉన్నారు. మైనీ రాష్ట్రం నుంచి డెమొక్రటిక్ పార్టీ తరఫున సారా గిడియోన్ సెనేటర్ పదవికి పోటీ పడుతున్నారు. అత్యంత బలమైన ప్రత్యర్థిగా పరిగణిస్తున్న రిపబ్లికన్ పార్టీ నేత సుసాన్ కొలిన్స్‌పై పోటీకి దిగారు. తాజాగా విడుదలైన అన్ని పోల్స్‌లో సారా ముందంజలో ఉన్నారు. సారా తండ్రి భారతీయుడు కాగా, తల్లి స్వస్థలం అమెరికా.
ఇంకొందరు
వీరితో పాటు మరికొందరు భారతీయ అమెరికన్లు అగ్రరాజ్య ఎన్నికల్లో తమ అదృష్టం పరీక్షించుకుంటున్నారు. రిపబ్లికన్ పార్టీ నుంచి రిక్ మెహతా, మంగ అనంతాత్ముల, నిషా శర్మ తదితరులు అమెరికన్ పార్లమెంట్‌కు ప్రాతినిధ్యం వహించాలని ఆశిస్తున్నారు. వీరిలో కొందరికి విజయం చేకూరే అవకాశం ఉందని విశ్లేషకులు ముందస్తుగా అంచనా వేసుకుంటున్నారు.
వీరి జయాపజయాలు పక్కనబెడితే.. అమెరికా రాజకీయాల్లో భారతీయుల ప్రభావం పెరుగుతోందని నిపుణులు నొక్కిచెబుతున్నారు.