హెచ్-1బీ వీసాల జారీ ప్రక్రియలో అమెరికా ఇమ్మిగ్రేషన్ సంస్థ (యూఎస్సీఐఎస్) తీరుపై అమెరికా చట్ట సభ్యులు, నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. వీసా దరఖాస్తు దారుల నుంచి సంబంధం లేని మరిన్ని ఆధారాలు (ఆర్ఎఫ్ఈ) అడుగుతూ ప్రక్రియను మరింత ఆలస్యం చేస్తున్నారని ఆరోపించారు.
అమెరికా కంపెనీలు హెచ్-1బీ వీసా సాయంతో విదేశాల్లోని వృత్తి నిపుణులను నియమించుకోవచ్చు. ఈ వీసాతోనే భారత ఐటీ నిపుణులు అధికంగా లాభం పొందుతున్నారు. ఈ వీసా ప్రక్రియలో జాప్యం కారణంగా వృత్తి నిపుణులు ఇతర దేశాలను ఆశ్రయిస్తున్నారని చట్టసభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
"టొరంటో (కెనడా)లో ఐటీ ఆదాయం సిలికాన్ వ్యాలీ, వాషింగ్టన్తో పోలిస్తే వేగంగా పెరుగుతోంది. ఇందుకు యూఎస్సీఐఎస్తో పాటు మన ఇమ్మిగ్రేషన్ విధానాలే కారణమని చాలా మంది భావిస్తున్నారు."
-సుసాన్ ఎల్లెన్ లాఫ్గ్రెన్, కాంగ్రెస్ సభ్యురాలు
నాలుగు నెలల్లో 60 శాతం
2019లో ఆర్ఎఫ్ఈ అభ్యర్థనలు భారీగా పెరిగాయి. ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో వచ్చిన 60 శాతం దరఖాస్తులకు ఆధారాలను కోరింది ఇమ్మిగ్రేషన్ శాఖ. ఈ సంఖ్య 2016 ఏడాది మొత్తం చేసిన ఆర్ఎఫ్ఈ అభ్యర్థనలకు 20.8 శాతం అధికం.
ఈ స్థాయిలో అభ్యర్థనలు పెరిగేందుకు కారణమేమిటని యూఎస్సీఐఎస్ అసోసియేట్ డైరెక్టర్ డొనాల్డ్ న్యూఫెల్డ్ను లాఫ్గ్రెన్ ప్రశ్నించారు. అందుకు ఆయన సమాధానమిచ్చారు.
"ఏదైనా కొత్త మార్పులు వస్తే ఆ విషయాలపై అధికారులతో పాటు ప్రజలకూ తెలియాల్సిన అవసరం ఉంటుంది. ఏదేమైనా దరఖాస్తులను తిరస్కరించకుండా ఆర్ఎఫ్ఈలను అభ్యర్థిస్తున్నాం. "
- డొనాల్డ్ న్యూఫెల్డ్, యూఎస్సీఐఎస్ అధికారి
నిబంధనల్లో మార్పులు వస్తే ప్రజలకు తెలిసేలా ప్రకటనలు చేయాలని అమెరికా ఇమ్మిగ్రేషన్ న్యాయవాదుల సంఘం అధ్యక్షులు మార్కెట్టా లిండిట్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇమ్మిగ్రేషన్ ఏజెన్సీనే పూర్తి స్థాయి వివరాలు అందివ్వాలన్నారు. ఇలా ఆకస్మిక నిర్ణయాలతో సంస్థలు ఇబ్బందులను ఎదుర్కొంటాయని ఆమె చెప్పారు.
నైపుణ్యాల వృద్ధి కార్యక్రమాలకే ఆ సొమ్ము: వాణిజ్య మంత్రి
హెచ్-1బీ వీసా రుసుము ద్వారా వచ్చే ఆదాయాన్ని అమెరికన్ల నైపుణ్య వృద్ధి కార్యక్రమాలకు వినియోగిస్తున్నట్లు ఆ దేశ వాణిజ్య మంత్రి విల్బర్ రాస్ స్పష్టం చేశారు. ఈ మేరకు "పరిశ్రమ గుర్తించిన అప్రెంటిస్షిప్ వ్యవస్థ"ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రారంభించారని తెలిపారు.
ఇదీ చూడండి: 10 శాతం తగ్గిన హెచ్-1బీ వీసాల జారీ