ఎటా తుపాను బీభత్సానికి సెంట్రల్ అమెరికా గజగజలాడుతోంది. ముఖ్యంగా హోండురస్ ప్రాంతం వణికిపోతోంది. అనేక ప్రాంతాలు నీటిలో మునిగిపోయాయి. ఈ నేపథ్యంలో అమెరికా సైన్యానికి చెందిన జాయింట్ టాస్క్ఫోర్స్- బ్రావోదళం రంగంలోకి దిగింది. వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలకు సహాయక చర్యలు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా వరదల్లో చిక్కుకున్న ఓ చిన్నారిని హెలికాప్టర్ ద్వారా సాహసోపేతంగా రక్షించిన వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది టాస్క్ఫోర్స్. ఇప్పటివరకు 11మందిని కాపాడినట్టు పేర్కొంటూ.. సహాయక చర్యలను కొనసాగించేందుకు ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నట్టు వెల్లడించింది.
హోండురస్లో తుపాను ధాటికి నదులు ఉప్పొంగాయి. సమీప ప్రాంతాలు జలమయమయ్యాయి. అనేక మంది ఇళ్లపైకి చేరి సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. తుపాను వల్ల సెంట్రల్ అమెరికావ్యాప్తంగా ఇప్పటివరకు 100 మందికిపైగా ప్రాణాలు కోల్పోయినట్టు అధికారులు అంచనా వేశారు.
ఇదీ చూడండి:- 15వ కాన్పులో ఆడపిల్ల- నెరవేరిన 30ఏళ్ల కల