అమెరికాలో నివసిస్తున్న వేలాదిమంది భారతీయులకు తాత్కాలిక ఊరట! హెచ్-1బీ వీసాదారుల జీవిత భాగస్వాముల(హెచ్-4 వీసాదారులు) ఉద్యోగ అనుమతులను రద్దు చేసేందుకు అక్కడి న్యాయస్థానమొకటి నిరాకరించింది. ఈ వ్యవహారంలో మరింత లోతైన పరిశీలన అవసరమని అభిప్రాయపడింది.
స్థానికులకు ఉద్యోగాలు కరవవుతున్నాయన్న ఆందోళనల నేపథ్యంలో హెచ్-4 వీసాదారుల ఉద్యోగ అనుమతులను రద్దు చేయాలని ట్రంప్ ప్రభుత్వం చాలాకాలంగా భావిస్తోంది. దీనిపై దాఖలైన కేసులో విచారణ నిర్వహించిన యూఎస్ కోర్ట్స్ ఆఫ్ అప్పీల్స్ ఫర్ ది డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా సర్క్యూట్ శుక్రవారం కీలక తీర్పు వెలువరించింది.
హెచ్-4 వీసాదారుల ఉద్యోగ అనుమతులను ప్రస్తుతానికి రద్దు చేయలేమని స్పష్టం చేసింది. ఈ వ్యవహారంలో డిస్ట్రిక్ట్స్ కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేసింది. లోతైన విశ్లేషణ జరిపాలంటూ దిగువ కోర్టుకు తిరిగి కేసును అప్పగించింది.
హెచ్-1బీ వీసా అంటే? ఇది వలసేతర వీసా. అమెరికా సంస్థలు విదేశీ నిపుణులను ఉద్యోగాల్లో చేర్చుకునేందుకు వీలు కల్పిస్తుంది. |
హెచ్-4 వీసా అంటే? హెచ్-1బీ వీసాదారుల కుటుంబ సభ్యులు (జీవిత భాగస్వామి, పిల్లలు) అమెరికాలో నివసించేందుకు దీన్ని మంజూరు చేస్తారు. |
అనుమతులు ఎప్పటి నుంచి? 2015లో ఒబామా అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు హెచ్-4 వీసాదారులకు ఉద్యోగ అనుమతులు కల్పిస్తూ ప్రత్యేక నిబంధన తీసుకొచ్చారు. |
1,00,000+ హెచ్-4 వీసాదారులకు ఉద్యోగ అనుమతులు లభించడంతో లబ్ధి పొందుతున్న మహిళలు. వీరిలో భారతీయులే అధికం. |
నాలుగింట మూడొంతులు మనోళ్లే.. 3,09,986: హెచ్-1బీ వీసాపై పని చేస్తున్న భారతీయుల సంఖ్య 4,19,637: హెచ్-1బీ వీసాపై పని చేస్తున్న మొత్తం విదేశీయుల సంఖ్య * 2018 అక్టోబరు నాటి లెక్కల ప్రకారం |
వివాదమేంటి? హెచ్-4 వీసాదారులు ఉద్యోగాలు చేస్తుండటంతో తమకు ఉపాధి అవకాశాలు తగ్గిపోతున్నాయంటూ స్థానిక పౌరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ట్రంప్ ప్రభుత్వం వారికి మద్దతు పలుకుతోంది. |