ఐరోపా దేశాల్లో కరోనా వ్యాప్తి క్రమంగా తగ్గుతున్న నేపథ్యంలో.. అమెరికాలోనూ అలాంటి సంకేతాలే కనిపిస్తున్నాయి. కేసులు, మరణాల్లో కాస్త క్షీణత నమోదైంది. జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం గణాంకాల ప్రకారం దేశంలో మృతుల సంఖ్య 40 వేలు దాటింది. 24 గంటల వ్యవధిలో అక్కడ 1997 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా 25 వేలకుపైగా కేసులు నమోదయ్యాయి.
తొలి నుంచీ వైరస్ తీవ్రత అధికంగా ఉన్న న్యూయార్క్‌లో క్రమంగా కేసులు, మరణాలు తగ్గుముఖం పడుతుండటం ఊరట కలిగిస్తోంది. శనివారం అక్కడ మరో 507 మంది మరణించారు. ముందటి రోజుతో పోలిస్తే ఇది 43 తక్కువ. ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్యా గణనీయంగా తగ్గినట్లు పేర్కొన్నారు గవర్నర్ ఆండ్రూ క్యోమో.
కేసులు తగ్గుతున్నా.. వైరస్ ప్రమాదకర దశలోనే ఉందని, భౌతిక దూరం సహా నిబంధనలన్నీ పాటించాలని సూచించారు గవర్నర్.
ఆంక్షల సడలింపు...
వైరస్ తీవ్రత తగ్గుతున్న నేపథ్యంలో టెక్సాస్‌లో దుకాణాలు తిరిగి తెరుచుకోనున్నాయి. ఫ్లోరిడాలో బీచ్‌లు, పార్కుల్లో పరిమితంగానైనా సందర్శకుల తాకిడి మొదలైంది.
కరోనా వ్యాప్తి చెందకుండా విధించిన ఆంక్షల్ని సడలించి, తమ తమ ఆర్థిక రంగాలను తిరిగి గాడిన పెట్టాలని అమెరికాలో గవర్నర్లు వేగిరపడుతున్నా.. మరీ వేగంగా ముందుకెళితే ఇబ్బందులేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. లాక్‌డౌన్‌ను వ్యతిరేకిస్తూ అనేక బృందాలు నిరసనలను తీవ్రతరం చేస్తున్నాయి.
ఆహార పొట్లాలకు ఎదురుచూపులు..
ఆకలి, నిరుద్యోగంతో ఇబ్బంది పడుతున్న అమెరికన్లు మాత్రం ఆహార పొట్లాల కోసం గంటలతరబడి ఎదురుచూస్తున్నారు. లాక్డౌన్ వల్ల దాదాపు 2.20 కోట్ల మందికి పనిలేకుండా పోయింది. ఇలాంటి వారంతా వెల్లువెత్తుతుండటంతో ఆహార పొట్లాలకు గిరాకీ అమాంతం పెరిగిపోతోంది. పరిస్థితిని చూసి అనేక సంస్థలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నా అవసరాలు తీరడం లేదు.