ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన అమెరికా, చైనాల మధ్య వివాదాలు మరింత ముదురుతున్నాయి. వాణిజ్య యుద్ధం కాస్త దారి మళ్లి దౌత్య సమరంగా మారింది. ఇప్పటికే హ్యూస్టన్లోని చైనా రాయబార కార్యాలయాన్ని అమెరికా మూసివేసింది. ఇందుకు ప్రతీకారంగా చెంగ్డూలోని అమెరికన్ దౌత్య కార్యాలయ నిర్వహణకు అనుమతులు ఉపసంహరించుకుంది చైనా.
ఇదీ చదవండి: 'చైనా కాన్సులేట్ మూసివేతకు అమెరికా ఆదేశం'
ఈ నేపథ్యంలో చెంగ్డూలోని తమ కార్యాలయాన్ని మూసివేస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. సోమవారం ఉదయం 10 గంటల నుంచి కార్యాలయంలో పనులు నిలిపివేసినట్లు అమెరికా విదేశాంగ శాఖ ప్రకటన జారీ చేసింది. చైనా తీసుకున్న నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇతర కార్యాలయాల ద్వారా ఈ ప్రాంతంలో కార్యకలాపాలు నిర్వహించేందుకు ప్రయత్నిస్తామని తెలిపింది.
ఇదీ చదవండి: చైనా కౌంటర్: అమెరికా కాన్సులేట్ మూసివేతకు ఆదేశం
చైనా ఆదేశాల ప్రకారం దౌత్యకార్యాలయాన్ని అధికారులు మూసివేయగానే అక్కడి అమెరికా జాతీయ పతాకాన్ని కిందకు దించినట్లు స్థానిక మీడియా పేర్కొంది.
మూసివేతల పర్వం
హ్యూస్టన్లోని రాయబార కార్యాలయాన్ని మూసివేయాలని అమెరికా చైనాను ఆదేశించింది. ఇక్కడి కాన్సూలేట్లో చైనా గూఢచర్యానికి పాల్పడుతోందని ఆరోపిస్తూ అమెరికా ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. టెక్సాస్ యూనివర్సిటీ, ఎండీ అండర్సన్ క్యాన్సర్ సెంటర్ నుంచి సమాచారం చోరీ చేసిందని ఆరోపించింది. అయితే అమెరికా ఆరోపణలను చైనా ఖండించింది. ఇందుకు ప్రతీకారంగా చెంగ్డూలోని దౌత్య కార్యాలయాన్ని మూసేయాలని అమెరికాను ఆదేశించింది.
ఇదీ చదవండి: 'అమెరికాలో మరిన్ని చైనా కాన్సులేట్‌లు బంద్'