పాకిస్థాన్ గగనతలంలో తిరిగే విమానాలకు ఉగ్రవాద ముప్పు పొంచి ఉందని అమెరికా విమానయాన సంస్థ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్( ఎఫ్ఏఏ) హెచ్చరించింది. పాక్‌లోని విమానాశ్రయాల్లో ఆగి ఉన్న, తక్కువ ఎత్తులో ఎగిరే విమానాలపై దాడి జరిగే అవకాశం ఉందని పేర్కొంది.
అయితే పాకిస్థాన్‌లో ఇప్పటివరకు సివిల్ ఏవియేషన్ సెక్టార్‌కు వ్యతిరేకంగా ఎటువంటి మ్యాన్ పాడ్(మ్యాన్ పోర్టెబుల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్)లు వాడుతున్నట్లు ఆధారాలు లేవని, కానీ కొన్ని ఉగ్రవాద సంస్థలు ఈ మ్యాన్ ప్యాడ్లను వినియోగిస్తున్నట్లు ఎఫ్ఏఏ అనుమానం వ్యక్తం చేసింది.
ల్యాండింగ్ టేకాఫ్ సమయాల్లో.. ఉగ్ర ముఠాలు తుపాకులతో, విమాన విధ్వంసక ఆయుధాలతో కానీ దాడికి తెగబడొచ్చని హెచ్చరించింది. అమెరికాకు చెందిన విమానయాన సంస్థలు, పైలట్లు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
నిత్యం వార్తల్లో పాక్...
ఉగ్రవాదం నేపథ్యంలో పాకిస్థాన్, ఆ దేశ గగనతలంపై నిషేధం నిత్యం వార్తల్లో నిలుస్తున్నాయి. భారత వైమానిక దళం బాలాకోట్‌లో చేసిన దాడి తర్వాత.. పాక్ గత ఏడాది ఫిబ్రవరి 26 నుంచి ఐదు నెలలపాటు గగనతలాన్ని మూసివేసింది.
సౌదీ అరేబియా పర్యటన కోసం ప్రధాని మోదీ విమానాన్ని పాక్ గగనతలం నుంచి వెళ్లేందుకు అనుమతించాలని గత అక్టోబరులో భారత్ కోరింది. కానీ పాక్ అందకు నిరాకరించింది.