అమెరికాలో కరోనా వైరస్ ప్రభావం కాస్త తగ్గుతున్నట్లు కనిపిస్తోంది. గడిచిన 24 గంటల్లో 1514 మంది ప్రాణాలు కోల్పోయారు. అంతకు ముందు రోజుతో పోలిస్తే ఈ సంఖ్య తగ్గడం ఊరట కలిగించే విషయం. శనివారం రోజున 1920 మంది మరణించారు.
ఇప్పటి వరకు అగ్రరాజ్యంలో 22,020 మంది మృతి చెందారు. వీటిలో ఒక్క న్యూయార్క్‌లోనే 9,385 మరణాలు సంభవించాయి. ప్రపంచంలో ఇదే అత్యధికం కావండ గమనార్హం. వైరస్ సోకిన వారి సంఖ్యలోనూ అమెరికాదే తొలి స్థానం. ఇప్పటి వరకు మొత్తం 5,59,409 మందికి వైరస్ సోకింది.
చైనాలో మళ్లీ పుంజుకున్న వైరస్..
కరోనా వైరస్‌కు తొలిసారి గుర్తించిన చైనాలో మళ్లీ పుంజుకుంటోంది ఈ మహమ్మారి. వైరస్ కట్టడికి కఠిన ఆంక్షలతో వైరస్‌ను అడ్డుకున్నట్లు ప్రకటించిన చైనా ప్రభుత్వానికి మరోమారు కేసుల సంఖ్యలో పెరుగుదల సవాలు విసురుతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో 108 కేసులు నమోదయ్యాయి. వైరస్‌కు కేంద్ర బిందువైన హుబే రాష్ట్రంలో ఇద్దరు మరణించగా.. మొత్తం మరణాల సంఖ్య 3,341కి చేరింది. ఇప్పటి వరకు మొత్తం 82,160 కేసులు నమోదయ్యాయి.
ప్రపంచ దేశాల్లో ఇలా..
గత ఏడాది డిసెంబర్లో చైనాలో కరోనా వైరస్‌ను గుర్తించిన నుంచి ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 200లకుపైగా దేశాలకు విస్తరించింది. మొత్తం 114,185 మంది మరణించారు. 1.8 మిలియన్లకుపైగా మందికి ఈ మహమ్మారి సోకింది. మరణాల సంఖ్యలో అగ్రరాజ్యం అమెరికా (22,020) అగ్రభాగాన ఉండగా.. ఆ తర్వాతి స్థానంలో ఇటలీ (19,899), స్పెయిన్ (17,209)లు ఉన్నాయి.