భారత్-చైనా మధ్య సయోధ్య కుదుర్చుతా: ట్రంప్
సరిహద్దు విషయంలో భారత్- చైనా మధ్య వివాదం రాజుకుంటున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారంలో అమెరికా మధ్యవర్తిగా వ్యవహరించేందుకు సిద్ధమని తెలిపారు. వివాదాన్ని పరిష్కరించే సత్తా అమెరికాకు ఉందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ఇప్పటికే భారత్, చైనాలకు తెలియజేశామంటూ ట్వీట్ చేశారు.
"సరిహద్దు వివాదం ముదురుతున్న వేళ మధ్యవర్తిగా వ్యవహరించేందుకు అమెరికా సిద్ధంగా ఉంది. ఈ విషయం భారత్, చైనాకు ఇప్పటికే తెలియజేశాం. "
-డొనాల్డ్ ట్రంప్ ట్వీట్.
గతంలో కశ్మీర్ వ్యవహారంలోనూ భారత్- పాక్ మధ్య మధ్యవర్తిగా వ్యవహరిస్తానంటూ ట్రంప్ ముందుకొచ్చారు. దీన్ని భారత్ అప్పట్లో వ్యతిరేకించింది. ఇది భారత్, పాక్ మధ్య వ్యవహారమని తేల్చిచెప్పింది.నివురుగప్పిన నిప్పులా...కొద్దిరోజుల కిందట తూర్పు లద్దాఖ్‌లోని పాంగాంగ్, సిక్కింలో భారత్, చైనా సైనికులు పరస్పరం ఘర్షణలకు దిగారు. ఈ ఘర్షణల్లో ఇరు దేశాలకు చెందిన అనేక మంది జవాన్లు గాయపడ్డారు. అప్పట్నుంచి లద్దాఖ్‌లో వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) వెంబడి పరిస్థితి నివురు గప్పిన నిప్పులా ఉంది. గాల్వాన్ లోయ, దెమ్‌చోక్, దౌలత్ బేగ్ ఓల్డీ వంటి సున్నిత ప్రాంతాలకూ ఉద్రిక్తతలు పాకాయి. తాజాగా సరిహద్దుల్లో ప్రశాంతతకు భంగం కలిగించేలా వేల సంఖ్యలో సైన్యాన్ని చైనా తరలించింది. దీంతో భారత్ సైతం సరిహద్దు వద్ద సైనికులను భారీగా మోహరించింది.చర్చల ప్రస్తావన..సరిహద్దులో ఉద్రిక్తతల నేపథ్యంలో పరిస్థితి పూర్తిగా నియంత్రణలోనే ఉందని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జావ్ లిజాన్ తెలిపారు. రెండు దేశాల యంత్రాంగాలు చర్చలు, సంప్రదింపుల ద్వారా సమస్యలను పరిష్కరించుకుంటారని చెప్పారు. సరిహద్దు వివాదంపై చైనా పూర్తి స్పష్టతతో ఉందన్నారు. రెండు దేశాల అధినేతల మధ్య కుదిరిన ఏకాభిప్రాయాన్నే తాము అనుసరిస్తున్నామని బుధవారం స్పష్టంచేశారు.