కరోనా టీకా విషయంలో మితిమీరిన జాతీయభావం సరికాదని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ తప్పుపట్టారు. ఇంకొన్ని దేశాలు అవసరానికి మించి ఉన్న టీకాను దాచుకుంటున్నాయని.. ఇది కూడా తప్పుడు చర్య అన్నారు. ఇలాంటి పనుల వల్ల అనేక పేద, మధ్యాదాయ దేశాల్లోని అమాయక ప్రజలు వ్యాక్సిన్‌కు దూరమవుతున్నారని ఆంటోనియో ఆక్షేపించారు. ఔషధ తయారీదారులతో జరుగుతున్న కొన్ని సైడ్ డీల్స్ కూడా ప్రపంచంలో అవసరమైన వారికి కరోనా టీకాను దూరం చేస్తున్నాయని మండిపడ్డారు. కరోనాను మహమ్మారిగా ప్రకటించి ఏడాదైన వేళ.. అంతర్జాతీయ వ్యాక్సినేషన్ కార్యక్రమం ఈ తరం నైతికతకు ఓ పరీక్షగా నిలిచిందన్నారు.
ప్రపంచంలో ప్రతి ఒక్కరికి టీకా అందుబాటులోకి తేవాలని గుటెరస్ అభిప్రాయపడ్డారు. మరీ ముఖ్యంగా అనేక పేద దేశాలకు వ్యాక్సిన్ అందుబాటులో లేదని.. ఆయా దేశాల్లో ఆర్థిక వ్యవస్థలు కోలుకోవడం చాలా అవసరమని అన్నారు. కొవిడ్ టీకాలు అనేవి లోకకల్యాణం కోసం ఉద్దేశించినవని చెప్పారు. టీకా ఉత్పత్తి సహా సరఫరాలో ప్రపంచం ఏకం కావాలని.. ఇప్పుడున్న ఉత్పత్తిని రెండింతలు చేయాలని చెప్పారు.
కరోనా వేళ రోగులకు సేవలందించిన ఆరోగ్య కార్యకర్తలకు ఆయన ప్రపంచ మానవాళి తరపున కృతజ్ఞతలు తెలిపారు. యువత కూడా తమ జీవన విధానాలను మార్చుకోవాల్సి ఉందని అభిప్రాయపడ్డారు.
ఇదీ చూడండి: 'మా అవసరాలు తీరాకే ఇతర దేశాలకు టీకా'