Ukraine Russia Conflict: ఉక్రెయిన్ సరిహద్దుల్లో పరిస్థితులు రోజురోజూకు దిగజారుతున్నాయి. ఆ దేశంపై ఎప్పుడైనా దాడి చేసేందుకు రష్యా సిద్ధంగా ఉందని అమెరికా నిఘా వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌లో తమ పౌరులకు తీవ్ర హెచ్చరిక చేశారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్. వీలైనంత త్వరగా ఉక్రెయిన్ విడిచి స్వదేశానికి తరలిపోవాలని సూచించారు. పౌరుల తరలింపునకు సైన్యాన్ని పంపిస్తే.. ప్రపంచ యుద్ధానికి దారి తీయవచ్చని పేర్కొన్నారు. ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బైడెన్ ఈ మేరకు వ్యాఖ్యానించారు.
"ఇది ఉగ్రవాద సంస్థతో వ్యవహరిస్తున్నట్లు కాదు. ప్రపంచంలోని అతిపెద్ద సైనిక వ్యవస్థలో ఒకటైన రష్యాతో వ్యవహరిస్తున్నాం. ఇది పూర్తిగాా భిన్నమైంది. పరిస్థితులు శరవేగంగా మారవచ్చు. అమెరికన్లను తరలించడానికి భద్రతా దళాలను ఉక్రెయిన్‌కు పంపితే.. అది ప్రపంచ యుద్ధానికి దారితీయవచ్చు" అని బైడెన్ చెప్పినట్లు ఎన్బీసీ మీడియా సంస్థ పేర్కొంది.
ఉక్రెయిన్‌కు వెళ్లొద్దు.. అక్కడే ఉంటే వచ్చేయండి
అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ కూడా ఇదే విధమైన సూచనలు చేసింది. తమ పౌరులు వీలైనంత త్వరగా ఉక్రెయిన్ వీడాలని సూచించింది. "రష్యన్ సైనిక చర్య, కరోనా నేపథ్యంలో ఉక్రెయిన్‌కు వెళ్లొద్దు. ఉక్రెయిన్‌లో ఉన్నవారు వాణిజ్య లేదా ప్రైవేట్ మార్గాల ద్వారా తక్షణమే బయలుదేరాలి. అక్కడే ఉన్నట్లయితే, నేరం, అశాంతి, సైనిక పోరాటాల పట్ల మరింత అప్రమత్తంగా వ్యవహరించండి. రష్యా సైనిక చర్యకు దిగితే.. కొన్ని ప్రాంతాలు తీవ్రంగా నష్టపోవచ్చు" అని స్టేట్ డిపార్ట్మెంట్ గురువారం పేర్కొంది.
ఇప్పటికే ఉక్రెయిన్‌లోని తమ ఉద్యోగులు, వారి కుటుంబాలను స్వదేశానికి తరిలించింది బైడెన్ సర్కారు. అనూహ్య రీతిలో మారుతున్న భద్రతా పరిస్థితుల దృష్ట్యా.. తమ పౌరులకు కీలక సూచనలు చేసింది.
ఇదీ చూడండి: 'కరోనా నాలుగో డోసూ వేయాల్సి రావొచ్చు'!