అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు మరోసారి షాకిచ్చింది ట్విట్టర్. జార్జ్ ఫ్లాయిడ్ మృతికి నివాళులు అర్పిస్తూ... ట్రంప్ ట్వీట్ చేసిన వీడియోను బ్లాక్ చేసింది. ఆ వీడియో యజమాని కాపీరైట్స్ క్లెయిమ్ చేయడం వల్లే బ్లాక్ చేసినట్లు ట్విట్టర్ స్పష్టం చేసింది.
ఆ ఖాతా నుంచే
ఓ కంపెనీ లేబుల్ ఉన్న వీడియోను 'టీమ్ ట్రంప్' ఖాతా నుంచి పోస్టు చేశారు. దీంతో ఆ వీడియోను తీసేయాలంటూ యజమాని కాపీరైట్ దావా వేసినట్లు ట్విట్టర్ వెల్లడించింది.
'కాపీరైట్స్పై సంస్థలు లేదా వాటి ప్రతినిధుల నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకు కాపీరైట్స్ నిబంధనల ప్రకారం.. మేము చర్యలు తీసుకుంటాం' అని ఓ ప్రకటనలో తెలిపింది ట్విట్టర్. అయితే ఎవరు ఫిర్యాదు చేశారో వెల్లడించలేదు.
ఆ వీడియోలో ఏముంది?
3 నిమిషాల 45సెకన్ల ఆ వీడియోలో శాంతియుతంగా జరుగుతున్న నిరసనలు, ఆందోళనకారులను పోలీసులు హత్తుకున్నట్లు, నిరసనలు హింసాత్మకంగా మారడం వల్ల ఓ భవనం కాలిపోతున్నట్టు, పియానో సంగీతం, చివరగా ట్రంప్ మాట్లాడుతున్నట్లు ఉంది. ఇప్పటికీ డొనాల్డ్ ట్రంప్ యూట్యూబ్ ఛానెల్లో ఆ వీడియోతో పాటు ఫ్లాయిడ్ ఫొటోలూ ఉన్నట్లు సమాచారం.
గత నెల నుంచి సామాజిక మాధ్యమాలు, ట్రంప్‌కు మధ్య వివాదాలు కొనసాగుతున్నాయి. తాజాగా ట్వీట్ బ్లాక్‌తో ఆ గొడవ మరింత తీవ్రమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇదీచూడండి: భారత్‌తో చర్చలు అంటూనే చైనా దూకుడు!