ఆఫ్రికన్ - అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ మృతికి నిరసనగా అమెరికాలో జరుగుతున్న నిరసనలు తీవ్రరూపం దాల్చాయి. నిరసనకారులు ఏకంగా.. శ్వేతసౌధానికి చేరుకొని బీభత్సం సృష్టించారు. వీరిని అడ్డుకునేందుకు రంగంలోకి దిగిన పోలీసులు వారిపైకి బాష్పవాయువు ప్రయోగించారు.
సుమారు వెయ్యి మంది వరకు శ్వేతసౌధానికి ఉత్తర దిశగా ఉన్న లాఫాయెట్ పార్క్‌కు చేరుకొని నినాదాలు చేశారు. పోలీసులు ఏర్పాటు చేసిన ప్లాస్టిక్ బారికేడ్లను ధ్వంసం చేసిన ఆందోళనకారులు.. వాటికి నిప్పంటించారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి ఆ పరిసరాల్లో గల అమెరికా జాతీయ జెండాను మంటల్లో వేశాడు. అక్కడే ఉన్న మరికొందరు చెట్లకొమ్మలను విరిచేసి మంటలను రేపారు. పార్క్ పక్కనే ఉన్న బాత్రూమ్లు, ఇతర నిర్వహణ కార్యాలయాలుండే నిర్మాణానికి నిప్పంటించారు. కొందరు నిరసనకారులు వైట్ హౌస్ మీదకు రాళ్లు రువ్వేందుకు యత్నించారు.
గంటపాటు అక్కడే..
నిరసనకారుల ఆందోళనలు క్రమంగా చెలరేగుతుండటం వల్ల వైట్ హౌస్ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు అప్రమత్తమయ్యారు. పరిస్థితులు చేజారకముందే అధ్యక్షుడు ట్రంప్‌ను ఉగ్రదాడుల వంటి అత్యవసర సమయంలో ఉపయోగించే రహస్య బంకర్‌లోకి తీసుకెళ్లారు. సుమారు గంటపాటు ఆయన అక్కడే ఉన్నట్లు తెలుస్తోంది. నిరసనకారుల ఆగ్రహావేశాలను చూసి ఆ సమయంలో ట్రంప్ బృందం తీవ్ర ఆశ్చర్యానికి లోనైనట్లు ఓ ఉన్నతాధికారి తెలిపారు.
అయితే, ఆయన సతీమణి మెలానియా ట్రంప్, కొడుకు బారన్ ట్రంప్‌ను కూడా బంకర్‌లోకి వెళ్లారా లేదా అనే అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. ఇలా అధ్యక్షుడు బంకర్‌లోకి వెళ్లడం చాలా అరుదుగా జరుగుతుంటుంది. ఏకంగా అధ్యక్షుడే కాసేపు అజ్ఞాతంలోకి వెళ్లాల్సి వచ్చిందంటే అక్కడి పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.
ఇదీ చదవండి: అగ్రరాజ్య నిరసనలతో మళ్లీ కరోనా విజృంభణ!