అమెరికా క్యాపిటల్‌లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారులు సృష్టించిన అలజడికి యావత్ ప్రపంచం ఉలిక్కిపడింది. జో బైడెన్ అధ్యక్ష ఎన్నిక ధ్రువీకరణ ప్రక్రియను నిరసనకారులు అడ్డుకున్న తీరు అందరినీ తీవ్ర ఆందోళనకు గురిచేసింది. ఘర్షణలతో క్యాపిటల్ వార్తల్లో నిలవడం ఇది కొత్తేమీ కాదు. కానీ ఈ చీకటి రోజును చరిత్ర ఎప్పటికీ మర్చిపోలేదు.
అసలేం జరిగింది?
అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ నేత జో బైడెన్ విజయాన్ని అధికారికంగా ధ్రువీకరించేందుకు స్థానిక కాలమానం ప్రకారం బుధవారం వాషింగ్టన్‌లోని అమెరికా కాంగ్రెస్ సమావేశమైంది. రాజ్యాంగబద్ధమైన ప్రక్రియ సాగుతుండగా.. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారులు వేలాది మంది క్యాపిటల్ భవనాన్ని చుట్టుముట్టారు. శాంతిభద్రతల నిబంధనలను ఉల్లంఘిస్తూ భవనం లోపలకు చొచ్చుకెళ్లారు. వారిని అడ్డుకునేందుకు ఏర్పాటు చేసిన బ్యారికేడ్లును ధ్వంసం చేశారు.
ఈ తరుణంలో క్యాపిటల్‌లో అత్యవసరంగా లాక్డౌన్ విధించారు. ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్‌తో పాటు భవనంలో ఉన్న నేతలను సురక్షిత ప్రాంతానికి తరలించారు.
ఇదీ చూడండి:- ఉపాధ్యక్షుడు పెన్స్‌పై ట్రంప్ కీలక వ్యాఖ్యలు
అప్పటికే అక్కడికి చేరుకున్న నిరసనకారులు.. ప్రతినిధుల సభ, సెనేట్‌లోకి దూసుకెళ్లారు. పోలీసుల కన్నా నిరసనకారుల సంఖ్య భారీగా ఉండటం వల్ల ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పరిస్థితిని అదుపు చేసేందుకు అధికారులు తీవ్రంగా శ్రమించారు. ఫలితంగా చట్టాలు ఆమోదించాల్సిన సభలు రణరంగాన్ని తలపించాయి. చివరకు నిరసనకారులపైకి పోలీసులు బాష్పవాయువు ప్రయోగించి, కాల్పులు జరపాల్సి వచ్చింది.
ఈ ఘటనలో ఇప్పటివరకు నలుగురు ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది గాయపడ్డారు. హింసకు సంబంధించి ఇప్పటివరకు 52మందిని అదుపులోకి తీసుకున్నట్టు అధికారులు ప్రకటించారు.
దాదాపు నాలుగు గంటల పాటు సాగిన అనూహ్య ఘటన అనంతరం క్యాపిటల్‌లో కార్యకలాపాలను పునరుద్ధరించారు. రాజ్యంగబద్ధమైన ప్రక్రియను కొనసాగించి అధ్యక్షుడిగా బైడెన్‌ను ధ్రువీకరించారు.
ట్రంప్ మాట...
క్యాపిటల్‌లో రగడ విషయాన్ని తెలుసుకున్న ట్రంప్.. చట్టానికి కట్టుబడి ఉండాలని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించవద్దని.. తన మద్దతుదారులకు ట్విట్టర్ వేదికగా వీడియో సందేశాన్ని అందించారు. శాంతియుతంగా ఉండి వెనుదిరగాలని కోరారు.
ట్రంప్ వీడియోతో పాటు.. ఘటన జరగక ముందు నిరసనకారుల తీరును వెనకేసుకొస్తూ ఆయన చేసిన ట్వీట్లను తొలగించింది ట్విట్టర్.
ఇదీ చూడండి:- 'ఎన్నికల్లో ఓటమిని అంగీకరించేది లేదు'
ఇది జరిగిన కొద్దిసేపటికే సామాజిక మాధ్యమాలు ఫేస్బుక్, ట్విట్టర్ అనూహ్య నిర్ణయం తీసుకున్నాయి. వివాదాస్పద పోస్టులతో నిబంధనలు ఉల్లంఘించారంటూ అధ్యక్షుడి ఖాతాలను సస్పెండ్ చేశాయి.
'ఇది నిజమైన అమెరికా కాదు..'
క్యాపిటల్‌లో జరిగిన హింసాకాండను జో బైడెన్ ఖండించారు. ప్రజాస్వామ్యంపై అసాధారణ దాడి జరిగిందన్నారు. దేశ చరిత్రలోనే దీనిని ఓ అవమానకర, సిగ్గుచేటు ఘటనగా అభివర్ణించారు. ఇది నిజమైన అమెరికాను ప్రతిబింబించదన్నారు. అధ్యక్షుడు ట్రంప్ బయటకు వచ్చి రాజ్యాంగంపై తాను చేసిన ప్రతిజ్ఞను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ పూర్తి వ్యవహారాన్ని మాజీ అధ్యక్షులు బరాక్ ఒబామా, జార్జి బుష్, బిల్ క్లింటన్, జిమ్మీ కార్టర్ ఖండించారు. అధికార బదిలీ ప్రశాంతంగా కొనసాగాలని ఆకాంక్షించారు.
ఇదీ చూడండి:- అమెరికా కాంగ్రెస్‌లో 'బైడెన్' పార్టీదే ఆధిపత్యం!
భవనంలో నెలకొన్న ఘర్షణను అమెరికా మీడియా ప్రత్యక్షప్రసారం చేసింది. ఆ దృశ్యాలు చూసిన ప్రపంచ దేశాలు ఉలిక్కిపడ్డాయి. భారత్ సహా అనేక దేశాలు శాంతికి పిలుపునిచ్చాయి. ఘటన ఎంతో బాధాకరమని ఐరాస, యూఎన్జీఏ ప్రకటించాయి.
రాజీనామాలు..
ఉద్రిక్తతలకు బాధ్యత వహిస్తూ ట్రంప్ యంత్రాంగంలో పలువురు రాజీనామా బాటపట్టారు. మెలానియా ట్రంప్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ స్టెఫానీ గ్రీషమ్, వైట్‌హౌస్ డిప్యూటీ ప్రెస్ సెక్రటరీ సారా మాథ్యూ, శ్వేతసౌధం సోషల్ సెక్రటరీ రికీ నెక్టా తమ పదవులకు రాజీనామా చేశారు. జాతీయ భద్రతా సలహాదారు రాబర్ట్ ఒబ్రెయిన్‌తో పాటు మరికొందరు రాజీనామా చేసే యోచలో ఉన్నట్టు తెలుస్తోంది.
మరోవైపు ఘర్షణపై పోలీసులు వ్యవహరించిన తీరుపై దర్యాప్తు చేపడతామని చట్టసభ్యులు పేర్కొన్నారు. సరైన సన్నద్ధత లేకపోవడం వల్లే నిరసనకారులు భవనం లోపలకు చొచ్చుకు రాగాలిగారా? అని అనుమానం వ్యక్తం చేశారు. ఈ కోణంలోనూ దర్యాప్తు చేస్తామని స్పష్టం చేశారు.
'ఘర్షణలను ట్రంప్ ప్రేరేపించారు'
క్యాపిటల్ ఉదంతం అనంతరం ట్రంప్‌పై అమెరికాలో వ్యతిరేకత తీవ్రస్థాయికి చేరింది. ఘర్షణను ఆయనే ప్రేరేపించారని మాజీ అధ్యక్షులు, చట్టసభ్యులతో పాటు అగ్రరాజ్య మీడియా ఆరోపించింది. ఆయనను అధికారం నుంచి తక్షణమే తొలగించాలన్న డిమాండ్లు పెరిగిపోయాయి. దీనికి తగ్గట్టుగా.. ట్రంప్‌ను తొలగించే అంశంపై సాధ్యాసాధ్యాలను కేబినెట్ సభ్యులు చర్చిస్తున్నట్లు అమెరికా మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఈ తరుణంలో ఈ నెల 20 వరకు ట్రంప్ అధ్యక్షుడిగా కొనసాగుతారా? లేదా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది.
ఇదీ చూడండి:- బైడెన్ ప్రమాణ స్వీకారానికి జార్జి బుష్