అమెరికా నోట్లో ఈ మధ్య బాగా నానుతున్న దేశాల్లో చైనా, ఇరాన్ ముందు వరుసలో ఉంటాయి. వీటిపై ట్రంప్ ఓ స్థాయిలో విరుచుకుపడుతున్నారు. పలు అంశాల్లో తిరుగుబాటు చేసిన ఇరాన్‌పై.. ఇప్పటికే కఠినమైన ఆంక్షలు కొనసాగుతున్నాయి. అయితే తాజాగా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం కీలక వ్యాఖ్యలు చేశారు ట్రంప్. తాను రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన తొలి నెలలోనే.. ఇరాన్ ఒప్పందం చేసుకునేందుకు ముందుకొస్తుందని వెల్లడించారు.
" ఈసారి ఎన్నికల్లో నేను గెలిచిన తొలి నెలలోనే అమెరికాతో ఒప్పందానికి ఇరాన్ ముందుకొస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం ఆ దేశ జీడీపీ 25 శాతం దిగువకు పడిపోయింది. కాబట్టి వారు మళ్లీ అద్భుతమైన దేశంగా పురోగమించాలంటే.. ఒప్పందం జరగాల్సిన అవసరం ఉందని భావిస్తున్నా"
-- డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు
మధ్య ప్రాచ్యంలో శాంతి నెలకొల్పడమే తన లక్ష్యమని అభిప్రాయపడ్డారు ట్రంప్. ఇప్పటికే ఇజ్రాయెల్-యూఏఈ మధ్య శాంతి ఒప్పందం చేయగా.. పాలస్తీనా విషయంలోనూ దృష్టి సారించనున్నట్లు తెలిపారు ట్రంప్.
పాలస్తీనాకు ప్రతి ఏటా 750 మిలియన్ డాలర్ల ఆర్థిక సాయం అమెరికా అందించేదని చెప్పిన ట్రంప్.. వారు శాంతి ఒప్పందాలను ఉల్లంఘించడం వల్ల అవన్నీ నిలిపివేసినట్లు స్పష్టం చేశారు. అయితే ఈ అంశంపైనా పునరాలోచిస్తామని అభిప్రాయపడ్డారు ట్రంప్.
ఇజ్రాయెల్-యూఏఈ శాంతి ఒప్పందంలో భాగంగా వచ్చే వారం అమెరికా నేతృత్వంలో ఇరుదేశాలు సంతకం చేసుకోనున్నాయి. రెండు దేశాల ప్రతినిధుల బృందాలకు వైట్‌హౌస్‌లో ట్రంప్ ఆతిథ్యం ఇవ్వనున్నారు. మధ్య ప్రాచ్యంలోని మిగతా దేశాలు ఇదే మార్గంలో నడుస్తాయని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికే సౌదీ అరేబియా సహా కొన్ని దేశాలతో శాంతి విషయంలో తాను సంప్రదింపులు జరుపుతున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు.
ఇవీ చూడండి: