ప్రపంచవ్యాప్తంగా అమెరికాలోనే కరోనా పరీక్షలు అత్యధికంగా నిర్వహించినట్లు తెలిపారు ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. అందుకే తమ దేశంలో కేసులు ఎక్కువ ఉన్నాయన్నారు. చైనా, భారత్ వంటి అధిక జనాభా ఉన్న దేశాల్లో కరోనా పరీక్షల సామర్థ్యం పెంచితే కచ్చితంగా అమెరికా కంటే ఎక్కువ కేసులు బయటపడతాయని ట్రంప్ అన్నారు.
అమెరికాలో ఇప్పటివరకు 2 కోట్ల మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు చెప్పారు ట్రంప్. జర్మనీలో 40 లక్షలు, దక్షిణ కొరియాలో 30 లక్షల మందికి మాత్రమే వైరస్ నిర్ధరణ పరీక్షలు చేసినట్లు చెప్పారు.
జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ వివరాల ప్రకారం అమెరికాలో ఇప్పటి వరకు దాదాపు 19 లక్షల మంది వైరస్ బారిన పడ్డారు. భారత్లో 2 లక్షల 36 వేల మందికి పైగా, చైనాలో 84 వేల మందికిపైగా కరోనా సోకింది. భారత్లో ఇప్పటి వరకు 40 లక్షలకు పైగా మాత్రమే కరోనా నిర్ధరణ పరీక్షలు చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
ఎక్కువ పరీక్షలు చేస్తేనే ఎక్కువ కేసులు బయటపడతాయని చెబుతున్నారు ట్రంప్. అమెరికాలో ఎక్కువ టెస్టులు నిర్వహించేందుకు కారణమైన పురిటన్ వైద్య పరికరాల తయారీ సంస్థకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం అమెరికాలో ఆర్థిక కార్యకలాపాలు పునరుద్ధరిస్తున్నామంటే ఎక్కువ పరీక్షలు నిర్వహించడమే కారణమన్నారు. ఆర్థిక వ్యవస్థ తిరిగి గాడిలో పడిందని, ఇది ఇంత త్వరగా సాధ్యమవుతుందని ఎవరూ ఊహించలేదన్నారు.