అమెరికా- భారత్ ద్వైపాక్షిక సంబంధాలు భవిష్యత్‌లో మరింత ఆశాజనకంగా ఉండేందుకు ట్రంప్, మోదీ భేటి దోహదపడుతుందన్నారు అగ్రరాజ్య రాయబారి, దక్షిణ, మధ్య ఆసియా రాష్ట్ర సహాయ కార్యదర్శి ఆలిస్ జి. వెల్స్. ప్రపంచంలో రెండు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలైన అమెరికా- భారత్ మధ్య అనుబంధం పరివర్తనం చెందేలా ట్రంప్ పర్యటన ఉంటుందన్నారు.
వాషింగ్టన్లో భారత నూతన రాయబారిగా తరంజిత్‌సింగ్ సంధు నియామకమైన సందర్భంగా యూఎస్, ఇండియా బిజినెస్ కౌన్సిల్ ఏర్పాటు చేసిన సమావేశంలో వెల్స్ మాట్లాడారు.
రెండు దశాబ్దాల క్రితం వాషింగ్టన్ పర్యటన సందర్భంగా అప్పటి భారత ప్రధాని వాజ్‌పేయీ.. ఇరు దేశాలు 'సహజ మిత్రులు' అని వ్యాఖ్యానించారని గుర్తు చేశారు వెల్స్.
" వేలాది మంది అరుపులు, కేరింతల మధ్య ట్రంప్, మోదీ కలయిక భవిష్యత్‌లో సరికొత్త చరిత్రను లిఖించబోతోంది. 20 ఏళ్ల క్రితం వాషింగ్టన్ పర్యటనలో అప్పటి ప్రధాని వాజ్‌పేయీ.. భారత్-అమెరికా సహజ మిత్రులు అని అన్నారు. ఈ రెండు దశాబ్దాలుగా ఆయన మాటలను వాస్తవం చేస్తున్నాం. భారత పర్యటన కోసం ట్రంప్ ఆత్రుతగా వేచిచూస్తున్నారు"
-వెల్స్, అమెరికా రాయబారి
చారిత్రక పర్యటన..
ట్రంప్ పర్యటన చారిత్రకమని, అన్ని రంగాల్లో ఇరు దేశాల మధ్య బంధాన్ని బలోపేతం చేయడానికి సహాయపడుతుందన్నారు అమెరికాలోని భారత రాయబారి తరంజిత్‌సింగ్ సంధు. అమెరికా, భారత్ మధ్య అత్యంత పరివర్తన చెందిన సంబంధాన్ని ఈతరం చూడబోతుందన్నారు.
" అమెరికా, భారత్‌ది బలమైన ద్వైపాక్షిక సంబంధం.. ఇరుదేశాలది విలువలతో కూడిన భాగస్వామ్యం. రెండు దేశాల విధానం ప్రజాస్వామ్యం"
-తరంజిత్‌సింగ్ సంధు, అమెరికాలో భారత రాయబారి