కరోనా సంక్షోభాన్ని తాను తక్కువ చేసి చూసినట్టు వచ్చిన వార్తలను మరోమారు ఖండించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. వైరస్‌ను ఎదుర్కొనేందుకు తాను చేపట్టిన చర్యలే ఇందుకు సాక్ష్యమన్నారు. అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. 'టౌన్‌హాల్' కార్యక్రమంలో పాల్గొన్న ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.
"కరోనా ముప్పును నేను ఎప్పడూ తక్కువ చేసి చూడలేదు. నిజానికి.. ఇంకా ఎక్కువే చేశా. ఎన్నో కఠిన, దృఢమైన చర్యలు తీసుకున్నా. నేను నిజమే చెబుతున్నా. ప్రజలు భయపడిపోవడం నాకు ఇష్టం లేదు."
--- డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు.
అయితే ట్రంప్ ప్రస్తుత మాటలు.. గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలకు విరుద్ధంగా ఉండటం గమనార్హం.
మాస్కులపై వీడని సందేహం...
మరోవైపు... తన సొంత యంత్రాంగం ఎన్నోసార్లు చెప్పినప్పటికీ.. మాస్కుల పనితీరుపై ట్రంప్‌కు ఇంకా సందేహాలు ఉన్నట్టు కనపడుతోంది. మాస్కులతో ఉపయోగం లేదని నమ్మేవారు చాలా మంది ఉన్నారని ఆయన చెప్పడమే ఇందుకు కారణం.
ఇదీ చూడండి:- కారు దిగకుండానే ఓటేసి వెళ్లిపోవచ్చు!
'చైనాను విశ్వసించా.. కానీ'
ఈ ఏడాది తొలినాళ్లలో.. కరోనా కట్టడికి చైనా చేపట్టిన చర్యలను తాను నిజంగా విశ్వసించినట్టు పేర్కొన్నారు ట్రంప్. పరిస్థితి అదుపులోనే ఉందని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ చెప్పారని.. ఆ మాటలను తాను నమ్మి ఆ దేశాన్ని పొగిడానని అంగీకరించారు. కానీ అవి నిజం కాదని ఆలస్యంగా అర్థమైనట్టు వివరించారు.
సమరానికి సన్నద్ధం...
ఈ నెల 29 నుంచి రిపబ్లికన్ ట్రంప్- డెమొక్రాట్ జో బైడన్ మధ్య అధ్యక్ష ఎన్నికల్లోనే అత్యంత రసవత్తరమైన సంవాదాలు ప్రారంభంకానున్నాయి. ఈ నేపథ్యంలో.. ఈ టౌన్‌హాల్ కార్యక్రమాన్ని సన్నద్ధంగా ట్రంప్ పరిగణించినట్టు తెలుస్తోంది. ప్రేక్షకుల ప్రశ్నలకు అవసరమైనప్పుడు రక్షణాత్మక ధోరణిని పాటిస్తూనే.. మిగిలిన సమయంలో తనదైన శైలిలో సమాధానాలిచ్చారు.
ఇదీ చూడండి:- 'సిరియా అధ్యక్షుడిని అప్పుడే లేపేద్దామనుకున్నా'