అమెరికాలో కార్చిచ్చు అంతకంతకూ విస్తరిస్తోంది. ఉత్తర కాలిఫోర్నియాలో చెలరేగుతున్న మంటల ధాటికి ముగ్గురు వ్యక్తులు మృతిచెందారు. అంతకంతకూ వ్యాపిస్తోన్న మంటలతో నాపా, సొనోమా కౌంటీల్లో అనేక నివాసాలు కాలి బూడిదయ్యాయి. సహాయక చర్యలు చేపట్టిన అగ్నిమాపక సిబ్బింది.. మంటలను ఆర్పే ప్రయత్నాలు చేస్తున్నారు. ముందస్తు చర్యల్లో భాగంగా ముప్పు ప్రాంతాల్లోని 70 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు.
బే ప్రాంతంలో 27 చోట్ల చెలరేగిన మంటలు ఇతర ప్రాంతాలకు వ్యాపించగా.. ఇప్పటికే సుమారు 19వేల ఎకరాలు బూడిదైంది. మరో 8,500పైగా నిర్మాణాలకు ముప్పు పొంచి ఉన్నట్టు అధికారులు తెలిపారు.
కార్చిచ్చు ప్రభావంతో అక్కడ రోజంతా వేడి వాతావరణం నెలకొందని ఓ అగ్నిమాపక అధికారి తెలిపారు. భారీ ఎత్తున పొగ కమ్ముకోవడం వల్ల విమాన సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఫలితంగా శాంటా రోజా ప్రాంతంలో విమాన సేవలు నిలిచిపోయాయి.
ఇదీ చదవండి: ధరణి గుండెల్లో గుబులు రేపుతున్న భూతాపం