రష్యాతో ద్వైపాక్షిక సంబంధాల్లో భాగంగా 'న్యూ స్టార్ట్' ఒప్పందం గడువును మరో ఐదేళ్లు పొడిగించాలని అమెరికా భావిస్తోంది. ఇది జాతీయ భద్రతతో ముడిపడిన అంశమని అధ్యక్షుడు బైడెన్ చాలా కాలంగా చెబుతున్నట్లు శ్వేతసౌధ వర్గాలు వెల్లడించాయి.
"న్యూ స్టార్ట్ ఒప్పందం గడువును మరో ఐదేళ్లు పొడిగించాలని వైట్‌హౌస్ భావిస్తోంది. అమెరికా జాతీయ భద్రత దృష్ట్యా అగ్రరాజ్యాధినేత బైడెన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. రష్యా అణు క్షిపణి దళాలను నిరోధించే ఏకైక ఒప్పందం ఇది. రష్యాతో వైరం కొనసాగుతున్న ప్రస్తుత తరుణంలో ఈ ఒప్పందం పొడిగింపు చాలా కీలకం"
జెన్ సాకి, శ్వేతసౌధ మీడియా కార్యదర్శి
"సోలార్ విండ్స్ సైబర్ ఉల్లంఘన, 2020 అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యం, రష్యా ప్రతిపక్ష నేత అలెక్సీ నవాల్నీపై విష ప్రయోగం.. వంటి అంశాలపై పూర్తి సమాచారం కోసం అధ్యక్షుడు ఇంటెలిజెన్స్ వర్గాన్ని ఆదేశించారు" అని సాకీ తెలిపారు.
న్యూ స్టార్ట్ ఒప్పందంపై పెంటగాన్ కొత్త అధికార ప్రతినిధి జాన్ కిర్బీ స్పందించారు. 'ఒప్పందాన్ని కొనసాగించడంలో మనం నిర్లక్ష్యం చూపిస్తే.. రష్యా దీర్ఘకాల అణు కార్యకలాపాలను అమెరికా కట్టడి చేయలేదు. 2026 వరకు ఈ ఒప్పందాన్ని పొడిగిస్తే రష్యా అణ్వాయుధ వ్యవస్థను నియంత్రించవచ్చు. దీనివల్ల అమెరికా ఎక్కువ నష్టపోదు. ఈ విషయంలో పెంటగాన్ పూర్తిగా సహకరిస్తుంది' అని ఆయన పేర్కొన్నారు.
ఇదీ చదవండి: విష ప్రయోగానికి గురైన రష్యా ప్రతిపక్ష నేత అరెస్టు
ఏమిటీ ఒప్పందం..
వ్యూహాత్మక ప్రమాదకర అణ్వాయుధాల వాడకాన్ని మరింత తగ్గించడం ఈ ఒప్పందం ముఖ్య ఉద్దేశం. దీనిపై ఇరుదేశాలు 2010లో సంతకాలు చేశాయి. ఇది 2011 ఫిబ్రవరి నుంచి అమల్లోకి వచ్చింది. 2021 ఫిబ్రవరి వరకు అమల్లో ఉండనుంది.
ఇదీ చదవండి: క్షీణించిన శశికళ ఆరోగ్యం.. పరిస్థితి విషమం