భవిష్యత్తులో చంద్రుడు, అంగారకుడిపైకి మనుషుల్ని పంపడమే లక్ష్యంగా స్పేస్ ఎక్స్ సంస్థ చేపట్టిన ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇందుకోసం రూపొందిస్తున్న భారీ రాకెట్ స్టార్‌షిప్(నమూనా) ప్రయోగం మరోసారి విఫలమైంది. ఇలా జరగడం ఇది నాలుగోసారి. శుక్రవారం భారీ ఏర్పాట్ల మధ్య టెక్సాస్‌లోని సంస్థ ప్రయోగ కేంద్రంలో రాకెట్‌ను ప్రయోగించేందుకు ఇంజిన్‌ను మండించగా.. అది నేలపై ఉండగానే పేలిపోయింది.
![The Space X project has failed due to Engine explode in project launching time](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7407367_1.jpg)
అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ(నాసా) కోసం స్పేస్ ఎక్స్ చేపట్టిన ప్రయోగం ఇటీవలే వాయిదా పడింది. అమెరికా వ్యోమగాములను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి(ఐఎస్‌ఎస్) తీసుకెళ్లడానికి ఉద్దేశించిన ఈ మిషన్ ప్రయోగానికి కొన్ని నిమిషాల ముందే ఆగిపోయింది. వాతావరణం అనుకూలించకపోవడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్టు నాసా వెల్లడించింది.
అయితే, తాజా స్టార్‌షిప్ ప్రయోగ విఫలం నాసా మిషన్‌పై ఉండబోదని సంస్థ సీఈఓ ఎలన్ మస్క్ స్పష్టం చేశారు. ప్రస్తుతానికి స్టార్‌షిప్ ప్రయోగాన్ని పక్కనబెట్టి అంతరిక్ష కేంద్రానికి వ్యోమగాముల్ని పంపే మిషన్‌పైనే దృష్టి సారిస్తామని తెలిపారు.
![The Space X project has failed due to Engine explode in project launching time](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7407367_2.jpg)
వందమందిని తీసుకెళ్లడమే లక్ష్యంగా..
స్టార్ షిప్ ద్వారా ఒకేసారి ఏకంగా వందమందిని తీసుకెళ్లాలన్న లక్ష్యంతో ప్రాజెక్టుని రూపొందించారు. మనుషులతో పాటు పదుల సంఖ్యలో ఉపగ్రహాలను కూడా మోసుకెళ్లేలా డిజైన్ చేశారు. భవిష్యత్తులో ఇతర గ్రహాలమీద ఆవాసాల నిర్మాణానికి అవసరమైన పరికరాలను పెద్దమొత్తంలో తీసుకెళ్లాలన్నదీ ఈ ప్రాజెక్టు లక్ష్యాల్లో ఒకటి.
ఇదీ చదవండి: రణరంగంలా అగ్రరాజ్యం- రంగంలోకి సైన్యం!