అఫ్గానిస్థాన్‌లో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తాలిబన్లు(Afghanistan Taliban).. ప్రపంచ దేశాల గుర్తింపు కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈనెల 21 నుంచి 27 వరకు ఐక్యరాజ్య సమితి 76వ వార్షిక సమావేశాల్లో(UNGA 2021).. ప్రపంచదేశాలను ఉద్దేశించి ప్రసంగించేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. ఈ మేరకు ఐరాస ప్రధాన కార్యదర్శి ఆటోనియో గుటెరస్‌కు రాసిన ఓ లేఖలో విజ్ఞప్తి చేశారు. దోహాలోని తమ అధికార ప్రతినిధి సుహైల్ షాహీన్‌ను ఐరాసలో అఫ్గాన్ ప్రతినిధిగా(afghan representative at un) ప్రతిపాదించారు.
ఐరాసలో ప్రస్తుతం అఫ్గాన్ ప్రతినిధిగా(afghan representative at un) గులాం ఇసాక్‌జాయ్ ఉన్నారు. తాజాగా తాలిబన్లు సుహైల్‌ను పేరును ప్రతిపాదించడం వల్ల గందరగోళానికి దారితీసినట్లయింది. అష్రాఫ్ ఘనీ దిగిపోయాడని, ప్రపంచంలోని ఏ దేశమూ ఆయన్ని అధ్యక్షుడిగా గుర్తించటం లేదని లేఖలో పేర్కొన్నారు తాలిబన్లు. ఐరాసలో శాశ్వత ప్రతినిధి మిషన్ ముగిసిందని, ఇసాజాక్ ఇకపై అఫ్గాన్ ప్రతినిధి కాదని స్పష్టం చేశారు.
తాలిబన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తకి రాసిన లేఖను ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ అధికార ప్రతినిధి ఫర్హాన్ హక్ ధ్రువీకరించారు. తాలిబన్ల విజ్ఞప్తి లేఖను 9 మంది సభ్యుల ఆధారాల కమిటీకి నివేదించినట్లు ఐరాస ప్రధాన కార్యదర్శి అధికార ప్రతినిధి హక్ తెలిపారు. ఈ కమిటీలో అమెరికా, చైనా, రష్యా సభ్యులుగా ఉన్నాయి.
అయితే.. ఈనెల 27న ఐరాస వార్షిక సమావేశాలు ముగియనుండగా అప్పటిలోగా ఈ కమిటీ సమావేశమయ్యే అవకాశం లేదని ఐరాస వర్గాలు పేర్కొన్నాయి. ఈసారి తాలిబన్ విదేశాంగ మంత్రి ఐరాసలో ప్రసంగించటం అనుమానమే అని తెలుస్తోంది.
ఇదీ చూడండి: 'తాలిబన్లు అలా చేయకుంటే అంతర్యుద్ధమే'
UNGA 2021: 'తప్పుడు మార్గంలో వెళ్తున్నాం.. అగాధం అంచులో ఉన్నాం'