మానవసహిత అంతరిక్ష యాత్రలో స్పేస్ఎక్స్ సంస్థ మరో విజయాన్ని నమోదు చేసింది. పునర్వినియోగ రాకెట్, క్యాప్సూల్‌ను ఉపయోగించి నలుగురు వ్యోమగాములను శుక్రవారం అంతరిక్షంలోకి పంపింది. ఫ్లోరిడాలోని కెనెడీ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ ప్రయోగం జరిగింది. ఏడాది కన్నా తక్కువ సమయంలో స్పేస్ఎక్స్కు ఇది మూడో యాత్ర కావడం విశేషం.
ఈ యాత్రలో అమెరికా, జపాన్, ఫ్రాన్స్ దేశాల వ్యోమగాములు ఉన్నారు. వీరు శనివారం ఉదయం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని(ఐఎస్ఎస్)కి చేరుకుంటారు. అక్కడే ఆరు నెలలు గడుపుతారు. వ్యోమగాముల ప్రయోగం కోసం పునర్వినియోగ క్యాప్సూల్, రాకెట్‌ను స్పేస్ఎక్స్ వినియోగించడం ఇదే తొలిసారి.
ఆ సంస్థ గత నవంబర్‌లో తన రెండో మానవసహిత యాత్రలో ఉపయోగించిన రాకెట్‌నే ఈ దఫా వాడింది. తొలి యాత్రలో ఉపయోగించిన 'క్రూ డ్రాగన్' క్యాప్సూల్‌ను ఈసారి వినియోగించింది. తాజా యాత్రలో పయనమైన అమెరికా వ్యోమగామి మెగాన్ మెక్ ఆర్థర్‌కు ఈ క్యాప్సూల్‌తో వ్యక్తిగత అనుబంధం ఉంది. తొలి యాత్రలో తన భర్త బాబ్ బెంకెన్ కూర్చున్న సీట్లోనే ఆమె ఆశీనులై, అంతరిక్షంలోకి పయనమయ్యారు.
ఇదీ చదవండి:'వాతావరణ లక్ష్యాన్ని కలిసి సాధిస్తాం'