స్పేస్ ఎక్స్ తన అతిపెద్ద రాకెట్‌ను 24 పరిశోధన ఉపగ్రహాలతో సహా మంగళవారం ప్రయోగించింది. ఈ రాకెట్లో అంతరిక్ష అణుగడియారం, సోలార్ సెయిల్, క్లీన్ అండ్ గ్రీన్ రాకెట్ ఇంధన టెస్ట్‌బెడ్, ఇంకా మానవ అస్తికలను సైతం అంతరిక్షంలోకి పంపారు.
భవిష్యత్ భద్రతా అవసరాల కోసం
ఫాల్కన్ హెవీ రాకెట్లలో ఇది మూడవది. అయితే మిలిటరీ అవసరాల కోసం ప్రయోగించిన మొదటి రాకెట్ ఇదే.
రక్షణ శాఖ స్పేస్ టెస్ట్ ప్రోగ్రాం కోసం ఎస్టీపీ-2 ప్రయోగం చేపట్టింది. దీని ద్వారా భవిష్యత్తులో జాతీయ భద్రత కోసం చేపట్టే ప్రయోగాలకు ఈ భారీ ఫాల్కన్ రాకెట్లు, తిరిగి ఉపయోగిస్తున్న బూస్టర్లు ఎంతమేర పనికొస్తాయనేది తెలుసుకోనున్నారు. సైన్యం పునర్వినియోగించి ప్రయోగం చేయటం ఇదే తొలిసారి.
చేతులు కలిపిన నాసా
అంతరిక్షంలోకి స్మారక రాకెట్ ప్రయోగించే ఈ కార్యక్రమంలో నాసాతోపాటు, నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్పియర్ అడ్మినిస్ట్పేషన్, వైమానికదళ పరిశోధనాశాల, ప్లానెటరీ సొసైటీ, సెలెస్టిస్ సంస్థలు చేతులు కలిపాయి.
స్మారక రాకెట్ ప్రయోగం
1970ల్లో నాసా మొట్టమొదటి అంతరిక్ష కేంద్రం స్కైలాబ్‌లో ప్రయాణించిన వ్యోమగామి బిల్ పోగ్ అస్తికలతో సహా మరో 150 మంది చితాభస్మాలనూ ప్రస్తుత రాకెట్ ప్రయోగం ద్వారా అంతరిక్షంలోకి పంపారు.
ఈ రాకెట్ ప్రయోగం ద్వారా ఉపగ్రహాలను మూడు వేర్వేరు కక్ష్యల్లో ప్రవేశపెట్టాల్సి ఉంది. అందుకోసం వివిధ దశల్లో ఎగువన ఇంజన్ మండించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ అంతా జరగడానికి చాలా గంటల సమయం పడుతుంది. అందువల్ల ఈ ప్రయోగం అత్యంత సవాలుతో కూడుకున్నదని స్పేస్ ఎక్స్ పేర్కొంది.
ఇదీ చూడండి: ఆరోగ్య భారతం: కేరళ టాప్- ఏపీ నెం.2