ప్రముఖ ఫొటో మేసేజింగ్ యాప్ స్నాప్‌చాట్ కీలక నిర్ణయం తీసుకుంది. అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఖాతాను తాము ప్రమోట్ చేయబోమని ప్రకటించింది. అయితే ఖాతాను మాత్రం తొలగించమని చెప్పింది.
జాతి హింస, అన్యాయాన్ని ప్రేరేపించే గొంతుకలకు తమ ప్లాట్‌ఫాంలో ప్రచారం కల్పించకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్నాప్‌చాట్ అధికార ప్రతినిధి తెలిపారు. అమెరికా అధ్యక్షుడికి సంబంధించిన కంటెంట్‌ను ప్రస్తుతం తాము ప్రమోట్ చేయట్లేదని వివరించారు. శాంతి, ప్రేమ, సమన్యాయం కోసం పోరాడుతున్న వారికి మద్దతుగా నిలుస్తామన్నారు.
విభజన వ్యక్తుల ఖాతాల వల్ల తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, అయితే వారు పోస్ట్ చేసే కంటెంట్ నిబంధనలకు విరుద్ధంగా ఉంటే వారిని ప్రమోట్ చేయమని తేల్చి చెప్పింది స్నాప్‌చాట్.
ట్రంప్‌నకు, సామాజిక మాధ్యమ దిగ్గజం ట్విట్టర్‌కు ఇప్పటికే వివాదం ముదురుతోంది. జార్జి ఫ్లాయిడ్ మృతి అనంతరం అమెరికాలో నిరసనలు వెల్లువెత్తాయి. హింసాత్మక ఘటనలు తారస్థాయికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ ఇటీవల చేసిన ఓ ట్వీట్లో హింసకు సంబంధించిన అంశాలున్నాయని పబ్లిక్ ఇంట్రెస్ట్ నోటీసు జారీ చేసి, ట్వీట్‌ను హైడ్ చేసింది ట్విట్టర్.
అంతకు ముందే ట్రంప్ చేసిన ఓ ట్వీట్‌కు ఫ్యాక్ట్‌చెక్ సూచన చేసింది ట్విట్టర్. దీనిపై ట్రంప్ తీవ్రంగా స్పందించారు. సామాజిక మాధ్యమాలపై చర్యలు తీసుకుంటానని హెచ్చరించి ప్రత్యేక ఆర్డినెన్స్‌పై సంతకం కూడా చేశారు. దీనిని ట్విట్టర్, ఫేస్బుక్ తీవ్రంగా ఖండించాయి.