ఈ ఊరి పేరు స్లాబ్ సిటీ. అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో ఉంది. శాన్‌డియాగోకి ఈశాన్యంగా 150 మైళ్లు వెళితే దీన్ని చేరుకోవచ్చు. సొనోరన్ అనే ఎడారి ప్రాంతంలో ఉంటుందీ నగరం. పేరుకి నగరమేగాని అక్కడ అలాంటి వాతావరణమేమీ కనిపించదు. అక్కడక్కడా ఎడారి మొక్కలు, చుట్టూ పర్వతాలు ఉంటాయి. వరుసల్లో కాకుండా అక్కడక్కడా వెదజల్లినట్టు ఇళ్లు కనిపిస్తాయి. ఇక్కడ స్థిర నివాసాలుండే వారు 150 మంది వరకూ ఉన్నారు. వీరిని స్నోబర్డ్స్ అని పిలుస్తారంతా. అంటే అమెరికాలోని చలి ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిన వారన్నమాట.
ఈ ఊరికి ప్రభుత్వం ఉండదు. ఇంటింటికీ నీరు, విద్యుత్తులాంటి సరఫరాలు అసలే కనిపించవు. ఆస్తి పన్నుల్లాంటివీ ఉండవు. చట్టాలు, నిబంధనలు ఏమీ ఉండవు. ఎవరైనా ఈ ఊరికొస్తే ఎక్కడోచోట ఉండిపోవచ్చు. అద్దెలు.. కరెంటు ఏమీ కట్టనవసరం లేదు. అయితే సౌకర్యాలూ ఉండవు మరి.
లాస్ట్ ఫ్రీ ప్లేస్..
1930ల వరకూ ఈ ఊరు ఓ మిలటరీ బేస్ క్యాంప్‌గా ఉండేది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఖాళీ అయిపోయింది. అప్పుడు స్లాబులు వేసిన చిన్న చిన్న గదులే ఇప్పుడు ఇక్కడ స్థిర నివాసం ఉంటున్న వారి ఇళ్లు. వాటినే వీరు ఆవాసాలుగా మార్చుకున్నారు. విద్యుత్తుని ఎవరికి వారు జనరేటర్ల ద్వారా ఉత్పత్తి చేసుకుంటారు. చెత్తను కంపోస్ట్ చేసుకుంటారు. సమీప నగరాల నుంచి సరకులు, నిత్యావసరాల్ని తెచ్చుకుంటారు. ఈ స్నోబర్డ్‌లని పిలిచేవారంతా మంచి కళాకారులు. చిత్రలేఖనం, పాత వస్తువుల్ని కళాకృతులుగా మార్చడంలో దిట్టలు. కళాకారులు ఊరికే ఉండరు కదా. ఇక్కడుండే చిన్న కొండల్ని మొత్తం రంగులతో నింపేశారు. చక్కని బొమ్మలతో ఆకర్షణీయంగా తయారు చేసేశారు. దీన్ని అక్కడి వారంతా అమెరికాలో ‘లాస్ట్ ఫ్రీ ప్లేస్’ అని అభివర్ణిస్తుంటారు.
ఇదీ చూడండి: పాపాల పాకిస్థాన్‌కు ఎఫ్ఏటీఎఫ్ 'బ్లాక్‌లిస్ట్' ముప్పు!