జర్నలిస్టు జమాల్ ఖషోగ్గీ హత్యకు సంబంధించి అమెరికా నిఘా వర్గాలు కీలక విషయాలు వెల్లడించాయి. ఖషోగ్గీ హత్యలో సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ ప్రధాన పాత్ర పోషించారని ఆఫీస్ ఆఫ్ ది డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ (ఓడీఎన్ఐ) నివేదికలో పేర్కొంది. ఈనెల 11న ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో కొంత భాగాన్ని చట్టసభలో శుక్రవారం అధికారులు బహిర్గతం చేశారు. సౌదీలో పాలన వ్యవస్థ, యువరాజు నియంతృత్వ ధోరణి, ఖషోగ్గి హత్య జరిగిన సమయంలో ఆ దేశంలో ఉన్న పరిస్థితులు ఆధారంగా ఈ నివేదికను రూపొందించామని స్పష్టం చేసింది.
"ఖషోగ్గీని టర్కీలో హత్య చేయమని సౌదీ యువరాజే ఆదేశాలు జారీ చేశారని మేము భావిస్తున్నాము. సౌదీలో యువరాజు సమ్మతి లేకుండా ఏ నిర్ణయం తీసుకోరు. 2017 నుంచి ఆ దేశంలోని భద్రత, నిఘా వ్యవస్థలోని కార్యకలాపాలు సల్మాన్ పర్యవేక్షణలోనే జరుగుతున్నాయి. అప్పచెప్పిన పని చేయకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందనే భయానక వాతావరణాన్ని సౌదీ అధికారులలో సల్మాన్ కల్పించారు. టర్కీలోని ఇస్తాంబుల్లో ఖషోగ్గీని హత్య చేసిన రోజు (అక్టోబరు 2, 2018) ఆ ప్రాంతానికి 15 మంది సభ్యులున్న సౌదీ బృందం చేరుకుంది. వీరిలో ఏడుగురు సౌదీ యువరాజు వ్యక్తిగత భద్రత దళానికి చెందిన వారు. యువరాజు అనుమతి లేనిదే వీరు ఈ ఆపరేషన్లో పాల్గొనరని మేము విశ్వసిస్తున్నాము. కాబట్టి ఈ హత్యలో సల్మాన్ హస్తం ముమ్మాటికీ ఉంది."
-ఓడీఎన్ఐ నివేదిక
ఖషోగ్గీ బ్యాన్..
నివేదిక వెల్లడైన అనంతరం విదేశాంగ మంత్రి టోనీ బ్లింకన్.. ఖషోగ్గీ బ్యాన్ పేరున సౌదీకి చెందిన 76 మంది వీసాలపై ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రకటించారు. అమెరికాలో స్థిరపడ్డ పలువురు సౌదీ కార్యకర్తలు, జర్నలిస్టులపై వీరు బెదిరింపులకు పాల్పడ్డారని పేర్కొన్నారు.
ఇదీ చదవండి : సిరియాకు సాయాన్ని రాజకీయం చేయొద్దు: భారత్