కరోనా ధాటికి అతలాకుతలం అవుతున్న అమెరికాకు సాయం అందించడానికి మరో అగ్రరాజ్యం రష్యా ముందుకు వచ్చింది. ఓ కార్గో విమానంలో కొవిడ్-19 రోగులకు చికిత్స అందించడానికి అవసరమైన వెంటిలేటర్లు, మాస్కులు సహా 60 టన్నుల వైద్య సామగ్రిని అమెరికాకు పంపించింది.
మరో పక్షం రోజుల్లో కరోనా మహమ్మారి ధాటికి అమెరికాలో సుమారు 2 లక్షల మంది ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. అప్రమత్తమైన డొనాల్డ్ ట్రంప్ మార్చి 30న స్వయంగా రష్యా దేశాధినేత వ్లాదిమిర్ పుతిన్‌తో ఫోన్లో మాట్లాడారు. రష్యా నుంచి వైద్య పరికరాలు కొనుగోలు చేసేందుకు సుముఖత వ్యక్తం చేశారు. పుతిన్ కూడా ఇందుకు సానుకూలత వ్యక్తం చేసి అత్యవసర సాయం అందించారు.
ఔషధాలు, వైద్య సామగ్రితో న్యూయార్క్‌లోని జాన్ ఎఫ్ కెన్నెడీ విమానాశ్రయానికి రష్యా రక్షణశాఖకు చెందిన కార్గో విమానం 'రుస్లాన్ ఏఎన్-124-100' చేరుకున్న వీడియోను నాటో పర్మినెంట్ మిషన్ ట్వీట్ చేసింది.
గతంలోనూ ఇలాంటి సంక్షోభ సమయాల్లో అమెరికా, రష్యా మానవతా దృక్పథంతో పరస్పరం సాయం చేసుకున్నాయని, భవిష్యత్‌లోనూ ఇది కొనసాగుతుందని అమెరికా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి మోర్గాన్ ఓర్టాగస్ అన్నారు.
ట్రంప్ ఫండ్
కరోనా దెబ్బకు దెబ్బతిన్న అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో భారీ ఉద్దీపన ప్యాకేజీ ప్రతిపాదించారు. రెస్టారెంట్లు, వినోద రంగ పరిశ్రమలకు కార్పొరేట్ పన్ను మినహాయింపు సహా మౌలిక సదుపాయాల కల్పనకు 2 ట్రిలియన్ డాలర్ల ప్రణాళికను ముందుకు తీసుకొచ్చారు.
ట్రంప్ ప్రభుత్వం కొన్ని రోజుల క్రితం 2.2 ట్రిలియన్ డాలర్ల ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించింది. దీని ద్వారా నలుగురు సభ్యులున్న ఒక అమెరికన్ కుటుంబానికి సగటున 3,200 డాలర్లు, వ్యాపార సంస్థలకు వాటి స్థాయిని బట్టి ఆర్థిక సాయం అందించింది.
ఇదీ చూడండి: 'మోస్ట్ ఫూలిష్ అమెరికన్‌గా డొనాల్డ్ ట్రంప్!'