అమెరికాలో నల్లజాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ మృతికి కారణమైన పోలీసులపై నిరసనలు హింసాత్మకంగా మారాయి. జార్జ్‌ను మోకాలితో పోలీసు అధికారి కర్కశంగా హింసించి అతడి మృతికి కారణమవడం వల్ల జాతివివక్షకు వ్యతిరేకంగా ఆఫ్రికన్ అమెరికన్లు అనేక రాష్ట్రాల్లో తీవ్ర స్థాయిలో ఆందోళనలు చేపడుతున్నారు.
న్యూయార్క్, అట్లాంటా, వాషింగ్టన్, మినియాపొలిస్ సహా అనేక రాష్ట్రాలు ఆందోళనలతో అట్టుడుకుతున్నాయి. ప్రధాన నగరాల్లో రహదారులను దిగ్బంధించిన నిరసనకారులు విధ్వంసం సృష్టించారు. కొవిడ్-19 నేపథ్యంలో అమలవుతున్న నిషేధాజ్ఞలను సైతం ధిక్కరించారు. పలు పోలీసు వాహనాలను దగ్ధం చేశారు.
స్వేచ్ఛ ఇవ్వండి లేదా న్యాయం చేయండి అంటూ పెద్దఎత్తున నినాదాలు రాశారు ఆందోళనకారులు. సమానత్వం ఇంకెప్పుడు? ఇంకా ఎన్నెళ్లు మేము లక్ష్యంగా మారాలి అంటూ పోలీసులను ప్రశ్నించారు. వాషింగ్టన్లో శ్వేత సౌధం ముందు ఆందోళనకారులు నిరసన వ్యక్తం చేశారు.
పోలీసు వానాలకు నిప్పు..
న్యూయార్క్ నగరంలో వేలాది మంది నిరసనకారులు ఫ్లాయిడ్‌కు సంఘీభావంగా భారీ ర్యాలీ నిర్వహించారు. ఫ్లాయిడ్‌కు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రోడ్లను దిగ్బంధించి ట్రాఫిక్‌ను స్తంభింపజేశారు. పోలీసులు సర్దిచెప్పేందుకు ప్రయత్నించినప్పటికీ ఆందోళనలు విరమించలేదు. బ్రూక్లిన్ పార్క్ వద్ద ప్లాయిడ్ మద్దతు దారులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కొంతమంది నిరసనకారులు పోలీసులపై రాళ్లు రువ్వారు. ఈ కారణంగా పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు బాష్ప వాయువు, రబ్బర్ బులెట్లు ప్రయోగించారు. ఆగ్రహించిన నిరసకారులు పోలీసు వాహనాలకు నిప్పుపెట్టారు. డెట్రాయిట్ నగరంలో ఆందోళనలను అణిచేందుకు జరిపిన కాల్పుల్లో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు.
దేశవ్యాప్తంగా 17 నగరాల్లో హింసకుపాల్పడ్డ వారిలో 1,400 మంది ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
హింసను సహించేదిలేదు..
ఆందోళనలు హింసాత్మకంగా మారడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. దేశంలో హింసను సహించబోనని ఆందోళనకారులను హెచ్చరించారు.
ఇదీ చూడండి:జీ-7 సదస్సు వాయిదా.. కొత్తగా భారత్‌కూ చోటు!