అగ్రరాజ్యం అమెరికాలో ఆందోళనలు ఉద్ధృతంగా కొనసాగుతున్నాయి. నల్లజాతీయుడు జార్జి ఫ్లాయిడ్ మృతిని నిరసిస్తూ ఆ దేశంలోని ప్రధాన నగరాల్లో శాంతియుత ర్యాలీలు నిర్వహించారు ప్రజలు. వేలాది మందితో రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. అన్ని రాష్ట్రాల్లో కర్ఫ్యూ ఆంక్షల సడలింపుతో శనివారం భారీ ర్యాలీలు నిర్వహించారు. 'బ్లాక్ లైవ్స్ మేటర్' అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. పోలీసు వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావాలని నినాదాలు చేశారు.
న్యూయార్క్‌లో...
న్యూయార్క్ నగరంలో రాత్రి 8 గంటల కర్ప్యూను అధికారులు ఉపసంహరించుకున్న తర్వాత వేలాది మంది ఆందోళనకారులు రోడ్లెక్కారు. మనటన్, బ్లూక్లిన్‌లో భారీ ర్యాలీలు నిర్వహించారు.
నిరసనకారులకు సాయం అందించేందుకు కొంతమంది వాలంటీర్లు ముందుకొచ్చారు. ఎండ ఎక్కువగా ఉన్న కారణంగా వారు విశ్రాంతి తీసుకునేందుకు సదుపాయాలు ఏర్పాటు చేశారు. ఆకలిగా ఉన్న వారి కోసం ఆహారాన్ని అందుబాటులో ఉంచారు.
వాషింగ్టన్లో
వాషింగ్టన్‌లోని శ్వేతసౌధం సమీపంలో వేలాది మంది నిరసన వ్యక్తం చేశారు. ఇటీవలి ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అక్కడ పటిష్ఠ భద్రతతో పాటు, బారీకేడ్లను ఏర్పాటు చేశారు అధికారులు. అయినప్పటికీ ఆందోళనకారుల నినాదాలతో ఆ ప్రాంతమంతా హోరెత్తింది. ప్రభుత్వం చర్యలు తీసుకునే వరకు ఇప్పట్లో ఆందోళనలు విరమించే ప్రసక్తే లేదని నిరసనకారులు తేల్చి చెప్పారు.
ఫ్లాయిడ్‌కు నివాళులు..
జార్జి ఫ్లాయిడ్ మృతికి ఆయన సొంత ప్రాంతమైన ఉత్తర కాలిఫోర్నియాలోని చర్చిలో నివాళులు అర్పించారు నిరసనకారులు. వందలాది మంది తరలివచ్చి సంతాపం తెలిపారు.
ఇతర దేశాల్లోనూ..
ఫ్లాయిడ్ మృతికి వ్యతిరేకంగా ఇతర దేశాల్లోనూ ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఐరోపా సమాఖ్యలోని ప్రధాన నగరాల్లో నిరసనలు చేపట్టారు ప్రజలు. పలుచోట్ల హింసాత్మక ఘటనలు జరిగాయి.