రక్షణ వ్యవస్థ బలోపేతమే లక్ష్యంగా రష్యా నుంచి ఎస్-400 క్షిపణి వ్యవస్థ కొనుగోలు చేసేందుకు.. 5 బిలియన్ డాలర్లు విలువ చేసే ఒప్పందాన్ని కుదుర్చుకుంది భారత్. 2018 నవంబరులోనే రెండు దేశాలు సంతకాలు చేశాయి. రష్యాతో ఒప్పంద జరిగితే ఆంక్షలు విధిస్తామని అగ్రరాజ్యం అమెరికా హెచ్చరించినా వెనక్కి తగ్గలేదు మోదీ సర్కార్. అయితే ఆంక్షల విషయంపై ఇంకా అధికారిక ప్రక్రియ ప్రారంభం కాలేదని తెలిపారు అమెరికా సీనియర్ దౌత్యవేత్త ఎలైస్ వెల్స్. రక్షణ రంగ సాంకేతికత విషయంలో భారత ప్రభుత్వం వ్యూహాత్మక నిబద్ధతతో వ్యవహరించాలన్నారు.
రక్షణ ఒప్పందంలో భాగంగా దాదాపు 800 మిలియన్ డాలర్లను గతేడాది రష్యాకు బదిలీ చేసింది భారత్. ఫలితంగా అధునాతన ఉపరితలం-గగనతలం క్షిపణి రక్షణ వ్యవస్థను పొందనుంది.
రష్యాపై ఇప్పటికే కాట్సా చట్టం(కౌంటరింగ్ అమెరికాస్ అడ్వర్సరీస్ త్రో సాంక్షన్స్ యాక్ట్) అమలు చేసింది అమెరికా. ఆ దేశంతో రక్షణ ఒప్పందం కుదుర్చుకున్న ఏ దేశానికైనా ఇవే ఆంక్షలు వర్తింపజేస్తామని హెచ్చరించింది.
కాంగ్రెస్ డిమాండ్
"కాట్సా చట్టానికి అమెరికా కాంగ్రెస్‌లో కచ్చితమైన విధాన ప్రాధాన్యత ఉంది. రక్షణ రంగంలో విక్రయాల ద్వారా ఆర్జించే భారీ లాభాలను పొరుగు దేశాల సార్వభౌమత్వాన్ని అణగదొక్కడానికి చైనా ఉపయోగిస్తోందని... అందుకే కచ్చితంగా కాట్సా అమలు చేయాలనే డిమాండ్ ఉంది" అని వెల్స్ తెలిపారు. భారత్‌పై కాట్సా అమలు చేసే విషయంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. రష్యా నుంచి ఎలాంటి సాంకేతిక వ్యవస్థలను భారత్ కోరుకుంటుందనే విషయంపై ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నట్లు పేర్కొన్నారు.
భారత్-అమెరికా మధ్య రక్షణ సంబంధాలు బలోపేతమవుతునట్లు చెప్పారు వెల్స్. అగరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటన తర్వాత రెండు దేశాల మధ్య ఒప్పందాల విలువ... 20 బిలియన్లు దాటినట్లు వివరించారు. మానవరహిత వైమానిక వాహనం(యూఏవీ) సహా పలు అధునాతన సాంకేతికలు అందించేలా అమెరికా విధానపరమైన మార్పులు తీసుకువస్తే బాగుంటుందన్నారు.
అగ్రరాజ్యానికి రక్షణ కల్పించే క్షిపణి వ్యవస్థనే భారత్ కూడా త్వరలోనే వినియోగించే అవకాశం ఉందన్నారు. రెెండు దేశాల మధ్య రక్షణ సంబంధాలు మరింత బలోపేతమవుతాయని ఆమె ధీమా వ్యక్తం చేశారు. భారత్‌ను అమెరికా ప్రపంచ శక్తిగా చూస్తోందని అభిప్రాయపడ్డారు వెల్స్.