కరోనా కారణంగా కకావికలమైన అగ్రరాజ్యం అమెరికాలో మొదటి విడత వ్యాక్సిన్ పంపిణీ జరుగుతోంది. చాలా మంది రాజకీయ నాయకులు టీకా వెేయించుకునేందుకు క్యూలో నిల్చుంటున్నారు. వ్యాక్సిన్‌పై ప్రజల్లో అపోహలు తొలగించేందుకు నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్, ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ ఇప్పటికే కరోకా టీకా బహిరంగంగానే తీసుకున్నారు.
అమెరికాలో కొంత మంది రాజకీయ నాయకులు ముందుగా టీకా తీసుకోవడానికి ముఖ్య కారణాలే ఉన్నాయి. వైరస్ బారిన పడకుండా ఉండటం, ప్రభుత్వ పాలన నిర్విరామంగా కొనసాగించడం, ప్రజల్లో టీకాపై విశ్వాసం పెంచడం వీటిలో కీలకం. అయితే ప్రస్తుతం దేశంలో పరిమిత సంఖ్యలోనే టీకాలు అందుబాటులో ఉంటటం, ముందుగా ఆరోగ్య కార్యకర్తలు, లక్షలాది మంది వృద్ధులకు టీకాలు ఇవ్వాలనే నేపథ్యంలో కొంత మంది నేతలు వ్యాక్సిన్‌ను ఆలస్యంగా తీసుకోవడమే సరైన నిర్ణయమని చెబుతున్నారు. ముందుగా ప్రజలకే టీకా ఇవ్వాలని, ఆరోగ్యంగా ఉన్న యువ నేతలకు వాటి అవసరం ఇప్పుడు అత్యవసరమేమీ కాదని అభిప్రాయపడుతున్నారు. మరికొంత మంది మాత్రం దేశాన్ని ముందుకు నడిపే నాయకులే మొదటగా తీసుకోవాల్సిన అవసరం ఉందని అంటున్నారు.
ముందు ప్రజలకే..
నేను వ్యాక్సిన్ తీసుకోవాలనుకున్నా. కానీ నా ఆరోగ్యం బాగా ఉంది. పెద్దగా వయసుపైబడలేదు. సీనియర్లు, ఆరోగ్య కార్యకర్తలందరికీ టీకా అందే వరకూ వేచి చూస్తా. ఆ తర్వాతే నేను తీసుకుంటా.
-టెడ్ క్రుజ్, టెక్సాస్ రిపబ్లికన్ సెనేటర్.
మిన్నెసోటా ప్రతినిధి ఇల్హాన్ ఒమర్ కూడా అదే తరహా అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆరోగ్య కార్యకర్తలు, సీనియర్లకు టీకా అందకముందే రాజకీయ నాయకులు వ్యాక్సిన్ వెయించుకోవడానికి క్యూలో నిల్చోవడం చూస్తుంటే బాధగా ఉందన్నారు. కరోనా వైరస్ బారిన పడి ఒమర్ తండ్రి ప్రాణాలు కోల్పోయారు.
రాజకీయ నాయకులకు టీకా అంశంపై చర్చ కేవలం అమెరికాకే పరిమితమైంది. ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహూ వంటి కొంతమంది దేశాధినేతలు ఇప్పటికే టీకా తీసుకన్నా, చాలామంది ఇతర దేశాల ప్రధానులు, అధ్యక్షులు టీకా తీసుకునేందుకు వేచి చూస్తున్నారు.
టీకా తీసుకోవడం కోసం వేచి చూసేందుకు తనకు ఎలాంటి సమస్య లేదని కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడో చెప్పారు. 40ఏళ్ల వయస్సున్న ఆరోగ్యవంతులకు వ్యాక్సిన్ తీసుకునేందుకు ఇంకా చాలా సమయముందన్నారు. ముందుగా ఆరోగ్యకార్యకర్తలు, సీనియర్లకే టీకా ఇవ్వాలని ఓ టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో చెప్పారు.
రిపబ్లికన్లపై మండిపాటు..
గతంలో కరోనా జాగ్రత్తలను పెడచెవిన పెట్టి మాస్కులు ధరించని, భౌతిక దూరం పాటించని కొంతమంది రిపబ్లికన్ నేతలు టీకా కోసం క్యూలో నిల్చోవడంపై పలువురు డెమొక్రాట్ నేతలు మండిపడ్డారు.
అయితే ప్రజా ఆరోగ్య నిపుణులు మాత్రం, వీరి వాదనతో విభేదించారు. గత చర్యల ఆధారంగా టీకాను వారు తీసుకొవద్దనడం సరికాదన్నారు. ప్రభుత్వం పరిపాలన సజావుగా సాగిస్తూ.. దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపించాలంటే నాయకులంతా టీకా తీసుకోవడమే మంచిదని చెబుతున్నారు. ప్రజల్లోనూ టీకాపై నమ్మకం ఏర్పడుతుందన్నారు.