అమెరికాలో ఫైజర్ సంస్థ అభివృద్ధి చేసిన కరోనా టీకాను పొందిన ఇద్దరు ఆరోగ్య పరిరక్షణ సిబ్బందికి అలర్జీలు తలెత్తాయి. అలస్కా రాష్ట్రంలోని బార్ట్లెట్ ప్రాంతీయ ఆస్పత్రిలో ఈ ఘటన జరిగింది.
ఒక ఆరోగ్య కార్యకర్తకు గతంలో ఎన్నడూ అలర్జీలు రాలేదు. కరోనా టీకా ఇచ్చిన 10 నిమిషాల్లోనే ఆ లక్షణాలు కనిపించాయి. ఆమె ఒంటిపై దద్దుర్లు రావడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, గుండె వేగంగా కొట్టుకోవడం వంటి ఇబ్బందులు తలెత్తాయి. కొన్నిసార్లు ఈ పరిస్థితి ప్రాణాంతకం కావొచ్చని నిపుణులు పేర్కొన్నారు. దీంతో ఆస్పత్రిలో చేర్చి, చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.
రెండో ఆరోగ్య కార్యకర్తకు టీకా ఇచ్చాక.. కంటి కింద చర్మం ఉబ్బెత్తు కావడం, కళ్లు తిరగడం, గొంతులో అసౌకర్యం తలెత్తాయి. కొన్ని మందులు ఇచ్చాక అతడు గంటలోనే కోలుకున్నాడు. టీకా షెడ్యూల్, డోసులపై తాజా పరిణామాల ప్రభావం ఉండబోదని అదికారులు తెలిపారు. ఆక్సిజన్, అలర్జీ ఔషధాలు అందుబాటులో ఉన్న కేంద్రాల్లోనే టీకాలు ఇవ్వాలని అమెరికా ఆహార ఔషధ నియంత్రణ(ఎఫ్‌డీఏ) ఇప్పటికే సిఫార్సు చేసింది.
బ్రిటన్‌లోనూ...
కాగా, బ్రిటన్‌లో కూడా గతవారం ఇలాంటివే రెండు కేసులు వెలుగుచూశాయి. కొన్ని నిర్దిష్ట ఔషధాలు, ఆహార పదార్ధాలు తదితరాల వల్ల అలెర్జీ తలెత్తే ఆరోగ్య పరిస్థితిని అనాఫిలాక్సిస్ అంటారు. ఈ సమస్య ఉన్నవారు ఫైజర్-బయో ఎంటెక్ వ్యాక్సిన్‌ను తీసుకోవద్దంటూ బ్రిటన్ వైద్య నిపుణులు సూచించారు. అలెర్జీ లక్షణాలున్న పలువురు అమెరికన్లు ఈ టీకా తీసుకున్నప్పటికీ సురక్షితంగానే ఉన్నట్టు ఎఫ్‌డీఏ తెలిపింది. వ్యాక్సిన్లు, దానిలోని సమ్మేళనాల పట్ల అలర్జీ ఉన్నవారు మాత్రమే ఫైజర్ టీకాను వినియోగించవద్దని సంస్థ సూచించింది.
ఈ విషయమై ఫైజర్ స్పందిస్తూ.. అనాఫిలాక్సిస్ లేదా అలర్జీ కలిగినవారు సరైన వైద్య పర్యవేక్షణలో మాత్రమే తమ వ్యాక్సిన్‌ను తీసుకోవాలనే సమాచారాన్ని స్పష్టంగా టీకా లేబుల్‌పై వివరించామని తెలిపింది. తాజా సంఘటనల నేపథ్యంలో అవసరమైతే ఈ సమాచారాన్ని మరింత మెరుగ్గా, సరళమైన భాషలో వివరిస్తామని ఆ సంస్థ ప్రకటించింది.