కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ కనిపెట్టడానికి ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇటీవల రష్యా.. వైరస్ టీకాను విడుదల చేయగా, పలు దేశాల్లో క్లినికల్ ట్రయల్స్ చివరి దశకు చేరుకున్నాయి. తాజాగా అమెరికా ఫార్మా దిగ్గజం ఫైజర్, జర్మన్‌కు చెందిన బయోఎన్‌టెక్ సంస్థలు సంయుక్తంగా తయారు చేస్తున్న వ్యాక్సిన్ కూడా తుది దశకు చేరుకుంది.
తొలి దశలో ట్రయల్స్ జరుపుకుంటున్న.. రెండు వ్యాక్సిన్ క్యాండిడేట్ల పరీక్ష ఫలితాలను.. దీనితో పోల్చి చూసినట్లు వెల్లడించింది. ఇది రోగనిరోధక శక్తి మెరుగుపర్చడంలో సఫలమైనట్లు తెలిపింది. తీవ్ర స్థాయిలో దుష్ప్రభావాలు కనిపించలేదని స్పష్టం చేసింది.
ఒక వైరస్.. క్యాండిడేట్ మాత్రం అత్యంత తక్కువ స్థాయిలో ప్రభావం చూపించినట్లు ఫైజర్ వివరించింది. వయసు ఎక్కువ ఉన్న వారిలో జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పులు వంటి లక్షణాలు కనిపించినట్లు పేర్కొంది. అయితే ఇవన్నీ తాత్కాలికమేనని స్పష్టం చేసింది. అమెరికా, ఇతర దేశాల్లోని 30 వేల మందిపై చివరి దశ ప్రయోగాన్ని ప్రారంభించినట్లు వెల్లడించింది.
మరోవైపు, సమర్థవంతమైన టీకా విడుదల కావటానికి ఎక్కువ సమయం పట్టవచ్చని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. వచ్చే ఏడాది నాటికి టీకా అందుబాటులోకి వస్తుందని అంచనా వేస్తున్నారు.