కరోనాపై పోరులో అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. 12ఏళ్ల వయసు పిల్లలకూ కొవిడ్ టీకా ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు ఫైజర్-బయోఎన్‌టెక్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అమెరికా ఆహార ఔషధ నియంత్రణ సంస్థ(ఎఫ్‌డీఏ) అనుమతి ఇచ్చింది. బుధవారం నుంచి టీకా పంపిణీ జరిగే అవకాశముంది.
పిల్లలకు కొవిడ్ టీకా అందిస్తే.. పాఠశాలలు తెరుచుకునే సరికి వారికి రక్షణ కలుగుతుందని అధికారులు భావిస్తున్నారు. దేశంలో సాధారణ పరిస్థితులు ఏర్పడాలంటే.. పిల్లలకు టీకాలు అందించడం ముఖ్యమని అంటున్నారు. తమ పిల్లలకు వ్యాక్సిన్లు అందించాలను తల్లిదండ్రులు కూడా ఎదురుచూస్తున్నట్టు పేర్కొన్నారు.
ప్రభుత్వం నిర్ణయంపై అమెరికన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పిల్లలకు టీకాలు అందితే తమకు ప్రశాంతంగా ఉంటుందని తల్లిదండ్రులు అంటున్నారు.
కరోనా మహమ్మారి నుంచి రక్షణలో ఆయా వయసు పిల్లలకు ఫైజర్ టీకా సురక్షితంగా, సమర్థంగా పనిచేస్తుందని ఎఫ్‌డీఏ పేర్కొంది. 2,000కు పైగా మంది చిన్నారులపై జరిపిన క్లినికల్ ట్రయల్స్‌లో ఈ విషయం వెల్లడైందని స్పష్టం చేసింది.