కరోనా వ్యాక్సిన్ విస్తృత వినియోగానికి అమెరికా సన్నద్ధమవుతున్న వేళ ఆ దేశంలో వైరస్ పంజా అందోళకర స్థాయికి చేరింది. కేసులు, మరణాలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. బుధవారం ఒక్కరోజే.. ఏకంగా 3000లకుపైగా మరణాలు సంభవించాయి. 9/11 ఉగ్రదాడుల్లో మరణాలతో పోలిస్తే బుధవారం నమోదైన కరోనా మరణాలే అధికంగా ఉండటం గమనార్హం.
బుధవారం అమెరికాలో 3,124 మరణాలు నమోదయ్యాయి. ఒక్కరోజు మరణాల సంఖ్యలో ఇదే అత్యధికం. ఏప్రిల్ 15న నమోదైన 2,603 మరణాలే ఇప్పటి వరకు ఒక్కరోజు మరణాల్లో గరిష్ఠంగా ఉండగా.. తాజా గణాంకాలు ఆ రికార్డును చెరిపేశాయి.
ఆ దాడుల్లో కన్నా..
రెండవ ప్రపంచ యుద్ధంలో నార్మాండీ దండయాత్ర ప్రారంభ రోజున మొత్తం 4,400 మంది మరణించగా.. అందులో అమెరికన్లే అత్యధికంగా 2,500 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే.. 2001, సెప్టెంబర్ 11న జరిగిన ఉగ్రదాడిలో 2,977 మంది మృతిచెందారు. ఈ రెండు దాడులతో పోల్చితే బుధవారం వెలుగుచూసిన మరణాలే అధికంగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది.
5 రోజుల్లో 10 లక్షల మందికి..
దేశవ్యాప్తంగా కరోనా సంక్షోభంతో ఆసుపత్రులు.. ఆరోగ్య కేంద్రాలు వైరస్ బాధితులతో నిండిపోయాయి. వైద్య సిబ్బంది రాత్రింబవళ్లు సేవలందించాల్సి వస్తోంది. ఆసుపత్రుల్లో పడకల కోసం ఐసీయూల ముందు రోగులు గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితులు ఉన్నాయని ఆరోగ్య సిబ్బంది పేర్కొంటున్నారు. అగ్రరాజ్యంలో గత ఐదు రోజుల్లో 10 లక్షల మందికి వైరస్ సోకింది. అందులో 1,06,000 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు మొత్తం 2,90,000 మంది మరణించారు. కోటిన్నర మందికిపైగా వైరస్ సోకింది.
ఫైజర్ టీకాకు ఆమోదం..!
ఫైజర్-బయోఎన్‌టెక్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన కొవిడ్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి గురువారం ఆమోదం తెలిపింది అమెరికా నిపుణుల కమిటీ. యూఎస్ ఎఫ్‌డీఏ అనుమతులు రాగానే పెద్ద ఎత్తున పంపిణీకి సన్నాహాలు చేస్తోంది ప్రభుత్వం.
ఇదీ చూడండి: టీకా వేయించుకున్నా మాస్క్ తప్పనిసరి!