అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా పెంపుడు శునకం 'బో' మరణించింది. క్యాన్సర్‌తో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయింది. బో మరణవార్తను ఒబామా, ఆయన సతీమణి మిషెలీ సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. తన నిజమైన స్నేహితుడు, నమ్మకమైన సహచరుడిని కోల్పోయానంటూ ఒబామా భావోద్వేగానికి గురయ్యారు.
"ఓ నమ్మకమైన మిత్రుడిని, విశ్వాసపరుడైన సహచరుడిని మా కుటుంబం కోల్పోయింది. దశాబ్దానికిపైగా.. 'బో' మా జీవితాల్లో భాగమయ్యాడు. మంచి, చెడులో మా వెంటే ఉన్నాడు. వైట్‌హౌస్‌లో ఉండే గందరగోళాన్ని అంతా తట్టుకున్నాడు. గట్టిగా మొరిగేవాడే కానీ ఎప్పుడూ కరిచేవాడు కాదు. ఎండాకాలంలో స్విమ్మింగ్ పూల్‌లో ఆడుకోవడానికి ఇష్టపడేవాడు. పిల్లలతో సంయమనంతో ఉండేవాడు."
-బరాక్ ఒబామా, అమెరికా మాజీ అధ్యక్షుడు.
'పోర్చుగీస్ వాటర్ డాగ్' జాతికి చెందిన ఈ శునకం ఒబామాకు కానుక రూపంలో అందింది. 2008 ఎన్నికల్లో ఒబామా ప్రచారానికి సహాయపడిన సెనెటర్, దివంగత ఎడ్వర్డ్ ఎం కెన్నెడీ.. 'బో'ను ఒబామాకు బహుకరించారు. 2013లో మరో శునకం 'సన్నీ'.. ఒబామా కుటుంబంలో భాగమైంది.
అధ్యక్షుడిగా ఉన్న సమయంలో శ్వేతసౌధంలో ఈ రెండు సందడి చేసేవి. అక్కడికి వెళ్లే సందర్శకుల్లో వీటికి బాగా ప్రాచుర్యం ఉంది. ఈస్టర్ ఎగ్ రోల్ వంటి పలు కార్యక్రమాల్లో ఈ శునకాలు పాల్గొనేవి.
సంతోషకరమైన ఏడాది!
ఒబామా సతీమణి మెషెలీ సైతం బో మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. 'బరాక్కు నాకు కాస్త విరామం కావాల్సినప్పుడు బో మాతో ఉండేవాడు. మా ఆఫీసుల్లోకి దర్జాగా వచ్చేవాడు. బంతిని తన దంతాలతో గట్టిగా పట్టుకునేవాడు. ఎయిర్‌ఫోర్స్ వన్(అధ్యక్షుడి విమానం)లోకి ఎక్కేటప్పుడు, వేల మంది వచ్చే ఈస్టర్ ఎగ్ రోల్ కార్యక్రమం జరిగేటప్పుడు మాతోనే ఉన్నాడు,' అంటూ బోతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
కరోనా కారణంగా గత ఏడాది కాలంగా దొరికిన సమయాన్ని 'బో'తో గడిపినందుకు సంతోషంగా ఉందని మిషెలీ పేర్కొన్నారు. ఈ ఏడాది పాటు బో చాలా సంతోషంగా ఉన్నాడని చెప్పారు.
ఇదీ చదవండి: పెంపుడు జంతువులపై ఇంకొంచెం ప్యార్ కరోనా!