దశాబ్దాలుగా సౌరవ్యవస్థపై అన్వేషణ జరుగుతున్నా.. భూమికి పొరుగు గ్రహమైన శుక్రుడిపై ఎక్కువగా పరిశోధనలు జరగలేదు. ఇప్పుడు నాసా చేసిన ప్రకటనతో పరిస్థితి మారనుంది. తమ తదుపరి సౌరవ్యవస్థ పరిశోధనల్లో భాగంగా శుక్ర గ్రహంపై అన్వేషణకు రెండు మిషన్లను చేపట్టనున్నట్లు నాసా వెల్లడించింది. 2028-2030 మధ్యలో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను నిర్వహించనున్నట్లు తెలిపింది.
1990 నుంచి శుక్రుడిపై ఒక్క మిషన్ అయినా చేపట్టని నాసా.. తాజాగా ఈ ప్రకటన చేయడం గ్రహ శాస్త్ర విజ్ఞాన విభాగంలో మార్పు దిశగా ఆలోచిస్తున్నట్లు సంకేతాన్నిస్తోంది. అంతరిక్ష శాస్త్రవేత్తలకు నూతన ఉత్తేజాన్నిస్తోంది.
శుక్ర గ్రహం ప్రతికూల ప్రపంచానికి నిలయం. అక్కడి వాతావరణంలో సల్ఫ్యూరిక్ ఆమ్లం ఉంటుంది. ఉపరితలంపై సీసం కరిగేంత ఉష్ణోగ్రత ఉంటుంది. కానీ మొదట్లో శుక్రగ్రహం ఇలా ఉండేది కాదు. భూమి లాగా ఉండేదని చెబుతారు. కానీ ఇంత ప్రతికూల గ్రహంగా మారడానికి కారణమేంటి?
- భూ గ్రహంపై కార్బన్ ప్రధానంగా రాళ్లలోనే చిక్కుకుని ఉండేది. కానీ శుక్రుడిపై అది వాతావరణంలో కలిసింది. ఫలితంగా 96 శాతం కార్బన్ డయాక్సైడ్ తయారైంది. దీంతో గ్రీన్హౌస్ ప్రభావం అదుపుతప్పింది. తద్వారా అక్కడ ఉపరితల ఉష్ణోగ్రత 750 కెల్విన్( 470 డిగ్రీల సెల్సియస్ లేదా 900 డిగ్రీల ఫారెన్‌హీట్)కు చేరింది.
- గ్రీన్హౌస్ ప్రభావాన్ని అధ్యయనం చేయడానికి, భూమిపై దాన్ని ఎలా నిర్వహించాలో తెలుసుకోవడానికి శుక్ర గ్రహం చరిత్ర అద్భుతంగా ఉపయోగుపడుతుంది. శుక్ర గ్రహంపై వాతావరణ పరిస్థితులను పరిశీలించి భూమిపై వాతావరణంతో పోల్చి చూసుకోవచ్చు.
- శుక్రుడి ఉపరితలంపై అధిక ఉష్ణోగ్రతలే ఆ గ్రహంపై అన్వేషణలు జరగకపోవడానికి ప్రధాన కారణం. అక్కడి వాతావరణంలో ఒత్తిడి దాదాపు 90 బార్లు ఉంటుంది. అంటే నీటిలో కిలోమీటరు లోతుకు వెళ్తే ఉండే పీడనంతో సమానం. ఈ ఒత్తిడితో శుక్రుడిపై దిగిన వెంటనే ల్యాండర్లు నిర్వీర్యం అవుతాయి. అందుకే ఆ గ్రహంపై ఇప్పటి వరకు నిర్వహించిన ఏ మిషన్ కూడా ప్రణాళిక ప్రకారం జరగలేదు.
- సోవియట్ యూనియన్ మాత్రమే ఇప్పటి వరకు శుక్రగ్రహంపై అన్వేషణలు జరిపింది. 1960-1980 మధ్య కాలంలో వీటిని నిర్వహించింది. నాసా 1972లో నిర్వహించిన పయనీర్ వీనస్ మిషన్, ఐరోపా అంతరిక్ష సంస్థ 2006లో చేపట్టిన వీనస్ ఎక్స్‌ప్రెస్ మిషన్ నిరుపయోగంగానే ముగిశాయి.
- 1970లో సోవియట్ యూనియన్ పంపిన వినెరా 7 శుక్రుడిపై తొలిసారి దిగిన ల్యాండర్. కానీ అక్కడి వేడికి పారాషూట్ కరిగిపోయి వినెరా 7 నిర్వీర్యమైంది. కానీ 20 నిమిషాల పాటు అక్కడి డేటాను భూమికి పంపింది. ఆ తర్వాత వినెరా 9.. శుక్రుడి ఉపరితలంపై తొలి ఫొటోను తీసింది. అనతరం వినెరాస్ 10, 13, 14 కూడా అక్కడి ఉపరితలంపై ఛాయా చిత్రాలను బంధించాయి.
నాసా చేపట్టబోయే రెండు మిషన్లు..
1. డావిన్సి ప్లస్- DAVINCI+( డీప్ అట్మాస్పియర్ ఆఫ్ వీనస్ ఇన్వెస్టిగేషన్స్ ఆఫ్ నోబుల్ గ్యాసెస్, కెమిస్ట్రీ అండ్ ఇమేజింగ్)
తొలుత శుక్రగ్రహంపై దిగేందుకు మూడు దశల్లో ఈ మిషన్‌ను నాసా చేపడుతుంది. అక్కడ వాతావరణ పరిస్థితులను పరిశీలిస్తుంది. ఈ గ్రహంపై సముద్రాలు ఏమైనా ఉండేవా అనే విషయాల గురించి శోధిస్తుంది. అక్కడి ఉపరితలంపై నుంచి హై రిజల్యూషన్ చిత్రాలను పంపనుంది.
2. వెరిటాస్- VERITAS (వీనస్ ఎమిసివిటీ, రేడియో సైన్స్, ఇన్సార్, టోపోగ్రఫీ, అండ్ స్పెక్ట్రోస్కోపీ)
వెరిటాస్తో శుక్రగ్రహంపై ఉపరితలాన్ని మ్యాప్ చేసి దాని ఖగోళ చరిత్రను అర్థం చేసుకునేందుకు నాసా ప్రయత్నిస్తుంది. శుక్ర గ్రహం భూమికి భిన్నంగా ఎందుకు అభివృద్ధి చెందింది అనే విషయాలను అన్వేషిస్తుంది. సింథటిక్ ఎపర్చర్ రాడార్‌తో శుక్రగ్రహాన్ని కక్ష్యలో ఉంచుతూ, స్థలాకృతి 3డీ పునర్నిర్మాణాలను రూపొందించడానికి దాదాపు మొత్తం గ్రహం మీద ఉపరితల ఎత్తులను చార్ట్ చేస్తుంది. టెక్టోనిక్స్, వోల్కానిజం వంటి ప్రక్రియలు శుక్రుడిపై ఇంకా చురుకుగా ఉన్నాయో లేదో నిర్ధరిస్తుంది.