అమెరికాలో జాతి వివక్ష వ్యతిరేక ఆందోళనలు ఉద్ధృతంగా వేళ.. కొంత మంది మాత్రం నేరాలకు పాల్పడుతున్నారని పోలీసులు అభియోగాలు మోపుతున్నారు. తాజాగా కాలిఫోర్నియా అధికారులు 100 మందికిపైగా నిందితులు దోపిడీ, దాడి, ఇతర నేరాలకు పాల్పడినట్లు కేసులు నమోదు చేశారు.
సాంక్రమెంటో కౌంటీ 43 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వీరిలో ఒకరు పోలీసు కారును దొంగిలించడానికి ప్రయత్నించారని, మరొకరు రాళ్లు, సీసాలు విసిరి అధికారులపై దాడులు చేశారని అభియోగాలు మోపారు.
శాంతియుత నిరసనలకు ఓకే.. కానీ..
'నల్లజాతీయులు జాతి వివక్షపై శాంతియుతంగా నిరసనలు చేపట్టడానికి అభ్యంతరం లేదు. అయితే అదే అదనుగా కొంత మంది దోపిడీలకు, దాడులకు, ఆస్తుల విధ్వంసానికి పాల్పడుతున్నారు. దీన్ని సహించేది లేదు. ఇలాంటి నేరాలకు పాల్పడిన వారిపై విచారణ జరిపించాల్సిన బాధ్యత నాపై ఉంది' అని లాస్ ఏంజెల్స్ జిల్లా అటార్నీ జాకీ లేసి అన్నారు.
ఒకరు మృతి
శాన్ఫ్రాన్సిస్కో నల్లజాతీయుల నిరసనలతో హోరెత్తుతోంది. బే ఏరియా నగరంలో ఓ ఆందోళనకారుడు తన వద్ద సుత్తిని తీస్తుండగా.. అది తుపాకీగా భావించిన పోలీసులు అతడిపై కాల్పులు జరిపారు. ఈ క్రమంలో అతడు మరణించాడు. గత వారం లాస్ ఏంజిల్స్ కౌంటీలో నిరసనలు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 3,000 మందికిపైగా అరెస్టు అయ్యారు. వీరిలో చాలా మంది కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నవారే.
ఇదీ చూడండి: మహాత్ముని విగ్రహానికి అమెరికాలో అగౌరవం