మోడెర్నా టీకా ప్రయోగాల్లో ఇప్పటి వరకు వచ్చిన ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయి. వృద్ధుల్లో కూడా వైరస్‌ను చంపే యాంటీబాడీలను ఈ టీకా తయారు చేస్తోందని తేలింది. ఈ యాంటీబాడీల స్థాయి కూడా యువతలో ఉన్నంతే ఉంటున్నట్లు ఓ పరిశోధన వెల్లడించింది.
అమెరికా జాతీయ అలర్జీ, అంటువ్యాధుల సంస్థ, ఫార్మా దిగ్గజం మోడెర్నా సంయుక్తంగా ఈ పరిశోధన నిర్వహించింది. దీనికి సంబంధించిన వివరాలు న్యూఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్‌లో ప్రచురించారు. కొవిడ్ కారణంగా తీవ్రమైన ప్రభావానికి గురయ్యే ముప్పున్న వృద్ధులపై కూడా ఈ టీకా బాగా పని చేస్తున్నట్లు పరిశోధనల్లో తేలింది. ఈ ఫలితాలు ఆశలు రేకెత్తించేలా ఉన్నాయని పరిశోధనలకు నేతృత్వం వహించిన డాక్టర్ ఇవాన్ అండర్సన్ పేర్కొన్నారు.
రెండు డోసులుగా
18-55 ఏళ్ల మధ్య వారిపై మోడెర్నా నిర్వహించిన ఫేజ్1 పరిశోధనలకు కొనసాగింపుగా దీనిని నిర్వహించారు. రెండు డోసులుగా వర్గీకరించి ప్రయోగించారు. ఒక డోసు కింద 25 మైక్రోగ్రాములు.. రెండో డోసుకింద 100 మైక్రోగ్రాములను వినియోగించారు. 56-70, 71 నుంచి ఆపై వయస్సు వారిని మరోబృందంగా ఎంచుకున్నారు. మొత్తం 40 మందిపై దీనిని ప్రయోగించారు. 71 ఏళ్ల పైబడిన 20 మంది వృద్ధులపై 100 మైక్రోగ్రాములను 28 రోజుల తేడాతో ప్రయోగించారు. వీరిలో యువతతో సమానంగా యాంటీబాడీలు ఉత్పత్తి అయ్యాయి. అయితే టీకా తీసుకున్న కొంత మంది వలంటీర్లకు జ్వరం, అలసట వంటి స్వల్ప ప్రతికూల ప్రభావాలు కనిపించాయని పరిశోధనలో వెల్లడైంది.
అమెరికా జాతీయ అలర్జీ, అంటువ్యాధుల సంస్థ, ఫార్మా దిగ్గజం మోడెర్నా సంయుక్తంగా ఈ టీకాను తయారు చేస్తున్నాయి.
ఇదీ చదవండి- 'పేద దేశాల కోసం 10 కోట్ల కరోనా టీకా డోసులు'